Sign in

హైదరాబాద్ : 69 ఇండిగో విమానాలు రద్దు.., 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు

ఇండిగో నిర్వహణ సంక్షోభం కారణంగా శనివారం హైదరాబాద్‌లోని ఆర్‌జీఐ విమానాశ్రయంలో మొత్తం 69 విమానాలు రద్దు అయ్యాయి. మరిన్ని అంతరాయాలు ఉండే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరికొన్ని రోజులు పట్టనుంది.

Published on: Dec 6, 2025, 11:38:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయంలో శనివారం కూడా గందరగోళం కొనసాగింది. విమానయాన సంస్థ మొత్తం 69 విమానాలను రద్దు చేసింది. శనివారం వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు వచ్చే 26 విమానాలు, హైదరాబాద్ నుండి వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన 43 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు విశాఖ నుంచి 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇందులో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌కు వెళ్లేవి ఉన్నాయి.

ఇండిగో విమానాలు రద్దు
ఇండిగో విమానాలు రద్దు

కార్యకలాపాలను సాధారణీకరించడం, సమయపాలనను తిరిగి తీసుకురావడం కాస్త కష్టమైన పనే అని అధికారులు చెబుతున్నారు. మరో పది రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయంటున్నారు. దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 10, 2026 నాటికి స్థిరమైన విమాన కార్యకలాపాలు పూర్తిగా పునరుద్ధరిస్తామని, రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని రద్దులు జరిగే అవకాశం ఉందని ఇండిగో తెలియజేసింది. సేవల్లో అంతరాయాలను తగ్గించడానికి డిసెంబర్ 8 నుండి విమాన కార్యకలాపాలను ఇండిగో తగ్గిస్తుంది.

37 రైళ్లకు 116 కోచ్‌లు

మరోవైపు విమానాశ్రయాల్లో ఉన్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. విమానాల రాకపోకల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే 37 ప్రీమియం రైళ్లకు 116 అదనపు కోచ్‌లను అటాచ్ చేసింది. దీని ద్వారా ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. పలు జోన్‌లలో 114 అదనపు ట్రిప్పులను కవర్ చేసింది.

రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు కోచ్‌లను జోడించినట్టుగా వెల్లడించింది. ఇది అన్ని జోన్లలో అత్యధికమని తెలిపింది. 'అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్‌లను జోడిస్తున్నాం.' రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఉత్తర రైల్వే ఎనిమిది సర్వీసులపై ఇలాంటి చర్యలను అమలు చేసింది. రద్దీగా ఉండే ఉత్తర కారిడార్లలో రద్దీని తగ్గించడానికి అదనంగా 3AC, చైర్ కార్ కోచ్‌లను మోహరించింది. పశ్చిమ భారతదేశంలోని ప్రయాణికుల కోసం, పశ్చిమ రైల్వే నాలుగు ప్రధాన రైళ్లలో 3AC, 2AC కోచ్‌లను అటాచ్ చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచింది. అంతేకాదు పలు ప్రత్యేక ట్రిప్పులను కూడా ప్లాన్ చేసింది రైల్వే శాఖ. విమానయాన అంతరాయాల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు మరింత సహాయం చేయడానికి, భారతీయ రైల్వేలు నాలుగు ప్రత్యేక రైలు సేవలను కూడా ప్రారంభించాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More