గ్రహణ యోగం ఏర్పడుతోంది.. ఈ 3 రాశుల వారు జూన్ 19నుంచి జాగ్రత్త!
జూన్ 19న చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించగా, అదే రాశిలో కేతువు సంచారం చేయడం వల్ల గ్రహణ యోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మేష, కన్యా, మీన రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే అది అన్ని రాశుల వారిపైనా ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. మరో ఎనిమిది రోజుల్లో, అంటే జూన్ 19న ఉదయం 10:06 గంటలకు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. నీడ గ్రహం కేతువు ఇప్పటికే సింహరాశిలో సంచారం చేస్తున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడినప్పుడు అది గ్రహణ యోగానికి దారి తీస్తుంది. ఈ యోగం సవాళ్లతో కూడుకున్నదని చెప్పచ్చు. ఎందుకంటే దీని ప్రభావం మానసిక అస్థిరత, గందరగోళం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, జీవితంలో హెచ్చుతగ్గులు ఇలా పలు మార్పుల రూపంలో కనిపిస్తాయి. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఏ రాశుల వారు గ్రహణ యోగం సమయంలో జాగ్రత్తగా ఉండాలి? ఏ రాశుల వారికి ఎలాంటి సమస్యలు కలిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకుని జాగ్రత్త పడడం మంచిది.
గ్రహణ యోగంతో ఈ రాశుల వారికి చిక్కులు.. ఈ సమయంలో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
మేష రాశి
మేష రాశి వారికి గ్రహణ యోగం కారణంగా సమస్యలు రావచ్చు. ఆరోగ్యం, మానసిక స్థితిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఏకాగ్రత కూడా దెబ్బతినవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థిక నష్టం కలగొచ్చు. కోర్టు కేసులు, న్యాయపరమైన వ్యవహారాల్లో ఉన్నట్లయితే సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాలు, కళల్లో ప్రయత్నాలు చేస్తున్న వారికి పురోగతి అవకాశాలు ఉన్నా, విజయం కోసం శ్రమ ఇంకా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది.
కన్యా రాశి
ఈ రాశి వారికి గ్రహణ యోగం సవాళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇల్లు, ఉద్యోగం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఈ రాశి వారికి ఈ సమయంలో కష్టంగా ఉండొచ్చు. మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బంది పడతారు. ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వద్దు. స్నేహితులు, ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాన్ని పెంచకుండా సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం.
మీన రాశి
మీన రాశి వారికి ఈ సమయం గందరగోళంగా ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు అప్పుగా ఇవ్వడం, పెట్టుబడి పెట్టడానికి ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం చాలా అవసరం. మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఆలస్యం జరగొచ్చు. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించి వివాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


