Sign in

తెలంగాణలో జూలై చివరి 15 రోజుల్లో పెరిగిన వానలు.. వర్షపాత లోటు ఎంతో తెలుసా?

తెలంగాణలో జూలై చివరి 15 రోజుల్లో వర్షాలు పెరిగాయి. దీంతో వర్షపాత లోటులో భారీగా మార్పు వచ్చింది. నెల రెండో భాగంలో కురిసిన వానలతో పరిస్థితి మారిపోయింది.

Published on: Jul 31, 2026, 15:40:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నైరుతి రుతుపవనాల సీజన్‌లో అత్యంత కీలమైన జూలై నెల ప్రారంభంలో తీవ్ర నిరాశపరిచినా.. ఆ తర్వాత పుంజుకుని రాష్ట్రంలో వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. జూలై నెల మొదట్లో రాష్ట్రంలో వర్షాలు కురవక పోవడంతో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. జూలై 16 నాటికి తెలంగాణలో ఏకంగా 61 శాతం మేర భారీ వర్షపాత లోటు ఏర్పడటంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే నెల రెండో భాగంలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన విస్తారమైన వర్షాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నెల ముగిసే సమయానికి వర్షపాత లోటు దాదాపుగా కవర్ అయింది.

జూలైలో వర్షాల
జూలైలో వర్షాల

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం.. సాధారణంగా జూలై నెలలో రావాల్సిన 227.6 మి.మీ. వర్షపాతానికి గాను, ఈ ఏడాది 224.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే నెల ముగిసేసరికి వర్షపాత లోటు కేవలం 1 శాతానికి మాత్రమే పరిమితమైంది.

జూలై రెండో అర్ధభాగంలో కురిసిన వర్షాల కారణంగా జూన్ 1 నుండి జూలై 31 వరకు రాష్ట్రంలో మొత్తం 339.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా రావాల్సిన 357.9 మి.మీ.తో పోలిస్తే లోటు కేవలం 5 శాతానికి పడిపోయింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం సాధారణంగా రావాల్సిన 276 మి.మీ.కి గాను 236.5 మి.మీ. వర్షపాతం మాత్రం నమోదై 14 శాతం లోటుతో వెనుకబడి ఉన్నాయి.

జిల్లా వారీగా నమోదైన వర్షపాతంలోనూ గణనీయమైన మార్పు కనిపించింది. జూలై 16 నాటికి కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా 27 జిల్లాలు లోటు వర్షపాతాన్ని, హనుమకొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు తీవ్ర లోటు కేటగిరీలో ఉన్నాయి. అయితే తర్వాతి రెండు వారాల్లో కురిసిన వర్షాల కారణంగా అనేక జిల్లాలు లోటు నుంచి బయటపడ్డాయి.

జూలై 31 నాటికి మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతంతో 'అధిక వర్షపాతం' జాబితాలోకి చేరాయి. హైదరాబాద్, రంగారెడ్డితో సహా మొత్తం 17 జిల్లాలు సాధారణ వర్షపాతంతో నెలను ముగించాయి. లోటు నమోదైన జిల్లాల సంఖ్య 12కి తగ్గగా, ఏ జిల్లా కూడా తీవ్ర లోటు కేటగిరీలో లేదు. హనుమకొండ, జనగామ, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి.

జూన్ నెలాఖరుతో పోలిస్తే ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో 130.3 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 115.3 మి.మీ. వర్షం కురిసి 12 శాతం లోటుతో ముగిసింది. ఆ సమయంలో కేవలం నాలుగు జిల్లాలు మాత్రమే అధిక వర్షపాతంలో ఉండగా, 16 జిల్లాలు లోటును, హనుమకొండ 71 శాతం లోటుతో తీవ్ర లోటును చూశాయి. సరిగ్గా నెల రోజుల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా కురిసిన రుతుపవనాల ప్రభావంతో వర్షపాత పరిస్థితి మారిపోయింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More