CBSE Board Exams 2026 : నేటి నుంచి 10, 12 తరగతి పరీక్షలు- టైమింగ్స్​, డ్రెస్​ కోడ్​ వివరాలు ఇలా..

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు నేటి (ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 43 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షల కోసం బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. డ్రెస్ కోడ్, సమయ పాలనపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published on: Feb 17, 2026, 05:27:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొత్తం 43 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండటం విశేషం.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026 అప్డేట్స్​..
సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026 అప్డేట్స్​..

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- పరీక్షల షెడ్యూల్ ఇలా..

సీబీఎస్​ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై మార్చి 10వ తేదీతో ముగియనున్నాయి. మొదటి రోజు విద్యార్థులకు గణితం (బేసిక్, స్టాండర్డ్) పేపర్లు ఉంటాయి. ఇక సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు కూడా నేటి నుంచే మొదలై ఏప్రిల్ 10 వరకు కొనసాగుతాయి. తొలిరోజు బయోటెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్ సబ్జెక్టులకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం మీద 10వ తరగతిలో 83 సబ్జెక్టులకు, 12వ తరగతిలో 120 సబ్జెక్టులకు బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- గణాంకాలు..

ఈ ఏడాది సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026కి హాజరవుతున్న వారి వివరాలను పరిశీలిస్తే..

మొత్తం విద్యార్థులు: 43 లక్షలకు పైగా.

10వ తరగతి: సుమారు 25 లక్షల మంది (వీరిలో 14 లక్షల మంది బాలురు, 10.9 లక్షల మంది బాలికలు).

12వ తరగతి: సుమారు 18.5 లక్షల మంది (వీరిలో 10.2 లక్షల మంది బాలురు, 8.3 లక్షల మంది బాలికలు).

పరీక్షా కేంద్రాలు: 10వ తరగతి కోసం 8,074, 12వ తరగతి కోసం 7,574 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సీబీఎస్ఈ పరీక్షలకు ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. మీ డౌట్స్‌కు సమాధానాలు!

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- విద్యార్థులు పాటించాల్సిన ముఖ్య సూచనలు..

పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ కొన్ని కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

సమయ పాలన: పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటలకు ముగుస్తాయి. అయితే, ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది.

డ్రెస్ కోడ్: రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా తమ పాఠశాల యూనిఫాంలోనే రావాలి. ప్రైవేట్ విద్యార్థులు మాత్రం సాధారణ దుస్తులు (షర్టులు, టీ-షర్టులు వంటివి) ధరించవచ్చు.

CBSE Exams 2026 : పదో తరగతి విద్యార్థులకు అప్డేట్.. పరీక్షల విధానంపై సీబీఎస్ఈ కీలక ప్రకటన!

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- మూల్యాంకనంలో కొత్త మార్పులు..

సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలకు ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్​ఎం) విధానాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ పద్ధతిలో జవాబు పత్రాలను స్కాన్ చేసి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మూల్యాంకనం చేస్తారు. దీనివల్ల ఫలితాల వెల్లడిలో మరింత పారదర్శకత, వేగవంతం చేకూరనుంది. ఈ ఓఎస్​ఎంకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్!

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- పరీక్షా కేంద్రానికి ఎన్ని గంటలకు చేరుకోవాలి?

సమాధానం- పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే, ఉదయం 10:00 గంటలకే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. కాబట్టి, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కనీసం 45 నిమిషాలు- గంట ముందే (అంటే 9:30 వరకు) కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.

ప్రశ్న- పరీక్షకు వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి?

సమాధానం- స్కూళ్లలో రెగ్యులర్‌గా చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా తమ పాఠశాల యూనిఫాంలోనే పరీక్షకు హాజరుకావాలి. ఒకవేళ మీరు ప్రైవేట్ అభ్యర్థి అయితే, సాధారణమైన తేలికపాటి దుస్తులు (షర్టులు లేదా టీ-షర్టులు) ధరించవచ్చు.

ప్రశ్న- 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయి?

సమాధానం- పదో తరగతి (క్లాస్​ 10) పరీక్షలు మార్చి 10వ తేదీతో ముగుస్తాయి. అలాగే, 12వ తరగతి (క్లాస్​ 12) పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More