Sign in

Constipation : మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా? ఏ ఆహారాలు తినాలి? వేటికి దూరంగా ఉండాలో తెలుసా?

Constipation Relieving Foods : మలబద్ధకం అనేది జీర్ణక్రియ సమస్య మాత్రమే కాదు, మనం తినే ఆహారపు అలవాట్లతోనూ దీనికి బలమైన లింక్ ఉంది. మలబద్ధకాన్ని పెంచే ఆహారాలు ఏవి, సహజంగా దీని నుంచి ఎలా ఉపశమనం పొందాలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వివరించారు.

Published on: Jun 22, 2026, 07:37:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుత కాలంలో మలబద్ధకం అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతి సాధారణ సమస్య! చాలా మంది తరచూ కడుపు ఉబ్బరంగా అనిపించడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు పూర్తిగా మందగిస్తుంది. అయితే, మలబద్ధకం అనేది కేవలం ఏదో ఒక చిన్న జీర్ణక్రియ లోపం మాత్రమే కాదని.. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారపు అలవాట్లతో దీనికి అత్యంత బలమైన సంబంధం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మలబద్ధకం సమస్యను తగ్గించే ఆహారాలు ఇవే!
మలబద్ధకం సమస్యను తగ్గించే ఆహారాలు ఇవే!

ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి సోషల్ మీడియా వేదికగా మలబద్ధకాన్ని మరింత తీవ్రం చేసే ఆహారాల గురించి ఒక లిస్ట్​ని షేర్​ చేశారు.

“మీరు ప్రతిరోజూ మోషన్ ఫ్రీగా అవ్వక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు, చాలా మంది దీనితో సతమతమవుతున్నారు. కానీ దీని వెనుక సులభంగా సరిదిద్దుకోగల కొన్ని కారణాలు ఉన్నాయి,” అని డాక్టర్ సౌరభ్ సేథి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

జీర్ణక్రియను మందగించే ఆహారాలు ఇవే..

ఫైబర్ (పీచుపదార్థం) తక్కువగా ఉండి, ఫ్యాట్ (కొవ్వు) లేదా రిఫైండ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు జీర్ణక్రియను చాలా నెమ్మదిగా మారుస్తాయని డాక్టర్ సేథి వివరించారు. ఇవి మలాన్ని గట్టిగా మార్చి మలబద్ధకానికి దారితీస్తాయన్నారు.

"ముఖ్యంగా.. చీజ్, వైట్ రైస్ (పాలిష్ చేసిన బియ్యం), మైదాతో చేసిన వైట్ బ్రెడ్, నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫుడ్స్, ఆల్కహాల్, పొటాటో చిప్స్, పచ్చిగా లేదా సరిగ్గా పండని అరటిపండ్లు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రేగుల కదలికలు బాగా తగ్గిపోతాయి. తద్వారా మలబద్ధకం వచ్చే అవకాశాలు వంద శాతం పెరుగుతాయి. ఇటువంటి ఆహారాన్ని తరచూ తినడం వల్ల కాలక్రమేణా మోషన్ అవ్వడం చాలా కష్టంగా, తీవ్రమైన నొప్పితో కూడుకున్నదిగా మారుతుంది," అని ఆయన హెచ్చరించారు.

చాలా మంది ఈ సమస్య నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం అల్లోపతి మందులు లేదా ఆయుర్వేద చూర్ణాలను ఆశ్రయిస్తుంటారు. కానీ, కేవలం మందుల వల్లే ఈ సమస్య పూర్తిగా నయం కాదని.. మనం తినే ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని డాక్టర్ సేథి స్పష్టం చేశారు.

సహజంగా మలబద్ధకాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్..

మలబద్ధకం సమస్య ఉన్నవారు తమ డైట్‌లో కొన్ని ప్రత్యేక ఆహారాలను చేర్చుకోవడం ద్వారా సహజంగానే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చని డాక్టర్ సౌరభ్ సేథి సూచించారు.

ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాలు: ఆల్బకరా, అవిసె గింజలు, ఓట్‌మీల్, కివీ ఫ్రూట్, పాలకూర, పియర్స్, చియా సీడ్స్, చిలగడదుంపలు.

బ్లాక్ కాఫీ: ఇది కూడా ప్రేగుల కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

ఈ ఆహారాల్లో పీచుపదార్థాలు, సహజ ఎంజైములు, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి మలాన్ని సాఫ్ట్‌గా మార్చడమే కాకుండా, జీర్ణక్రియ సాఫీగా సాగేలా తోడ్పడతాయి.

అప్పుడప్పుడు ఇబ్బంది పడేవారి కోసం చిన్న చిట్కాలు..

ఎప్పుడో ఒకసారి మలబద్ధకం సమస్యను ఎదుర్కొనే వారి కోసం డాక్టర్ సేథి మూడు సింపుల్ రెమెడీస్ చెప్పారు. అవి..

సరైన పొజిషన్ : టాయిలెట్ సీటు ముందు ఒక చిన్న స్టూల్ వేసుకుని, దానిపై పాదాలను ఉంచాలి. దీనివల్ల మీ మోకాలు, నడుము భాగం కంటే పైకి వస్తాయి. ఈ పొజిషన్ వల్ల మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది.

ఎక్కువగా నీరు తాగడం: శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి.

శారీరక శ్రమ: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి. శరీర కదలికలు పెరిగినప్పుడు, మనం తిన్న ఆహారం పెద్ద ప్రేగు గుండా త్వరగా ప్రయాణిస్తుంది. ఇది మలవిసర్జన ప్రక్రియను మరింత సులభతరం, క్రమబద్ధంగా మారుస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More