అతనో హోంగార్డు.. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. కానీ ఆయన ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి. ఏకంగా ఏసీబీ… అతని అక్రమాస్తులపై ఫోకస్ పెట్టే అంత వరకు విషయం వెళ్లింది. దీంతో ఏకకాలంలో ఆయన నివాసంతో పాటు మరో రెండో చోట్ల సోదాలు చేపట్టడంతో…. భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు ఎన్ శ్రీనివాసరావు భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీకి సమాచారం అందింది. దీంతో శ్రీనివాసరావుకు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాకంలో సోదాలు చేపట్టారు. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.
భారీగా ఆస్తులు…!
ఆయనకు సంబంధించిన రికార్డులు, దస్త్రాలను పరిశీలించగా… శ్రీనివాసరావు ఏకంగా రూ.20 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. సాధారణ హోంగార్డు ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారన్నది చర్చనీయాంశంగా మారింది.
శ్రీనివాసరావు ఏసీబీలో కూడా కొన్నేళ్లు పని చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే…. ఏసీబీ రైడ్స్‌పై కొందరికి ముందుగానే సమాచారం ఇచ్చి క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏడాది క్రితమే ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఏసీబీ అధికారులు… ఏకకాలంలో పలుచోట్ల సోదాలు చేయడంతో శ్రీనివాసరావు అక్రమార్జన చిట్టా బయటపడినట్లు అయింది. శ్రీనివాసరావు అక్రమాస్తుల వ్యవహారంపై మరింత లోతుగా ఏసీబీ అధికారుల బృందం విచారణ జరిపే అవకాశం ఉంది. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.