Vijayawada Gade Sai Krishna Missing Case : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన యువకుడి అదృశ్యం ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన నాగరాజుపై పోలీసులు శుక్రవారం హత్య కేసు నమోదు చేశారు. గాదె సాయికృష్ణ (23) అనే యువకుడిని పోలీస్ కస్టడీలో దారుణంగా హింసించి…. చంపేశారంటూ బాధితుడి తల్లి ఆరోపించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
తల్లి ఫిర్యాదు - సీఐపై చర్యలు
సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి (53) గురువారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా…. పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. "నిన్న సాయంత్రం (గురువారం) నా సోదరి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు," అని సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.
ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (1), 127 (4), 127 (6) లతో పాటు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 238 కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 103 హత్య నేరానికి సంబంధించింది కాగా….. సెక్షన్ 127 అక్రమ నిర్బంధాన్ని సూచిస్తుంది.
తమ కుమారుడిని ఇన్‌స్పెక్టర్ నాగరాజు పోలీస్ స్టేషన్‌లోనే అక్రమంగా బంధించి, ప్రాణం పోయే వరకు దారుణంగా హింసించాడని తల్లి ఆరోపిస్తోంది. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా బూడిదగా మార్చేశాడని విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా, అత్యంత రహస్యంగా సాయికృష్ణ మృతదేహాన్ని ఇన్‌స్పెక్టర్ దహనం చేశాడని అనుమానం వ్యక్తం చేసింది.
యువకుడి అదృశ్యం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించేందుకు వీలుగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నియమించారు.
{{/usCountry}}యువకుడి అదృశ్యం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించేందుకు వీలుగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నియమించారు.
{{/usCountry}}మరోవైపు గురువారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కస్టడీ మరణంపై సిబిఐ (CBI) దర్యాప్తు జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. కస్టడీలో థర్డ్ డిగ్రీ హింస జరిగిందని…. బాధితుడిని తీవ్రంగా వేధించడమే కాకుండా చేతి గోళ్లు కూడా పీకేశారని జగన్ ఆరోపించారు. మే 9 నుంచి జూన్ 2 వరకు సాయికృష్ణ తల్లి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన కొడుకును ఒక్కసారి చూపించమని పోలీసులను వేడుకుందని మాజీ సీఎం గుర్తుచేశారు. లోపల కొడుకును కొడుతుంటే వస్తున్న అరుపులు వింటూ బయట ఆ తల్లి రోదించినా….. కనీసం చూడటానికి కూడా పోలీసులు అనుమతించలేదని ఆయన విమర్శించారు.
నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సహా సీనియర్ పోలీస్ అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన రాలేదని జగన్ ఆరోపించారు. బాధితుడి బంధువులలో ఒక న్యాయవాది ఉన్నారని, ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన వినతులను సైతం ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత పేర్కొన్నారు.
వెలుగులోకి మరో వీడియో…!
ఈ వివాదం ఇలా ఉంటే….. అదే ఇన్‌స్పెక్టర్ నాగరాజు వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడిన పెరుపోగు క్రాంతి కుమార్ అనే దళిత యువకుడి సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఇన్‌స్పెక్టర్ నాగరాజు పెడుతున్న టార్చర్, వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మే 21న విషం తాగి ప్రాణాలు విడుస్తూ తీసుకున్న ఆ సెల్ఫీ వీడియోలో క్రాంతి కుమార్ ఆరోపించారు. సాయికృష్ణ కేసు వెలుగులోకి రావడంతో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.