తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసరలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

మే 31 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ లింక్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
ఈసారి మార్పులు ఇలా…!
గతేడాది వరకు తెలంగాణ టెన్త్ ఫలితాలను గ్రేడింగ్విధానంలో ప్రకటించారు. పాత పద్ధతికి స్వస్తి పలికిన తెలంగాణ సర్కార్… ఈ ఏడాది మార్కులను ప్రకటించింది. పాత పద్ధతిలోనే మార్కులను ప్రకటించే విధానాన్ని పునఃప్రారంభించింది. ఫలితంగా గ్రేడ్స్ కాకుండా… మార్కుల ఆధారంగానే ఐఐఐటీలోనూ ప్రవేశాలను కల్పించనున్నారు.
ఎంపిక విధానం ఎలా….
- ఐఐఐటీ క్యాంపస్ లో ప్రవేశాల కోసం పదో తరగతిపాస్ అయిన విద్యార్థులు అప్లయ్ చేసుకునేందుకు అర్హులవుతారు.
- పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.
- ఈ ఏడాది బాసరలోని 1500 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్ లోనూ ఐఐఐటీ క్యాంపస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుంచే ప్రవేశాలను ఖరారు చేశారు. ఇక్కడ 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది.
- తాజాగా మార్కుల విధానం అమలు చేస్తుండటంతో… ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు.
- ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. అంటే మొత్తం 24 అదనపు మార్కులు జోడిస్తారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.
- ఒకవేళ 2 విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు.
- సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.