...
...
Next Story

Hyderabad : ఫాస్ట్‌ఫుడ్ గోదాంలో సోదాలు - ఈ కల్తీ పుడ్ తింటే అంతే సంగతి..! వెలుగులోకి విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ చార్మినార్ పరిధిలో అనుమతి లేకుండా నడుస్తున్న ఫాస్ట్‌ఫుడ్ గోదాముపై హెచ్-ఫాస్ట్ బృందం దాడి చేసింది. లైసెన్స్ లేకుండా ప్రమాదకర రసాయన రంగులు వాడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. భారీగా కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Published on: Jun 19, 2026 02:09 PM IST
Advertisement

హైదరాబాద్ నగరంలో నకిలీ, కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై పోలీసులు, ఆహార భద్రతా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘా ఉంచిన హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) తాజాగా చార్మినార్ పరిధిలో మరో భారీ అక్రమ కేంద్రాన్ని బట్టబయలు చేసింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి హెచ్-ఫాస్ట్ బృందం హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ తయారీ కేంద్రం, గోదాముపై మెరుపు దాడి నిర్వహించింది.

చార్మినార్‌ అక్రమ ఫాస్ట్‌ఫుడ్ గోదాముపై టాస్క్‌ఫోర్స్ దాడి
చార్మినార్‌ అక్రమ ఫాస్ట్‌ఫుడ్ గోదాముపై టాస్క్‌ఫోర్స్ దాడి

విశ్వసనీయ సమాచారం అందుకున్న అధికారులు చార్మినార్ పరిధిలోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్ ప్రాంతంలో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు అధికారులను సైతం షాక్‌కు గురిచేసాయి. అక్కడ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ, అత్యంత అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు.

తనిఖీల్లో వెల్లడైన ఉల్లంఘనలు:

  • సదరు కేంద్రానికి ఎలాంటి నిర్బంధ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.
  • ఆహారం ఆకర్షణీయంగా కనిపించడం కోసం ప్రభుత్వం నిషేధించిన కృత్రిమ రసాయన రంగులను (MSK లయన్ గ్రీన్ మరియు రాస్ప్‌బెర్రీ రెడ్) విచ్చలవిడిగా వాడుతున్నారు.
  • నిబంధనలకు విరుద్ధంగా పాడైపోయిన, విషపూరితంగా మారిన వంట నూనెను పదే పదే వేడి చేస్తూ వంటకాలకు ఉపయోగిస్తున్నారు.
  • ఆహార తయారీకి వాడే నీటికి సంబంధించి ఎలాంటి నీటి విశ్లేషణ ధృవీకరణ కానీ… నాణ్యత నియంత్రణ చర్యలు కానీ లేవు.
  • గోదాం అంతా విపరీతమైన అపరిశుభ్రతతో నిండిపోయింది. కీటకాల నియంత్రణ లేకపోవడంతో పురుగులు తిరుగుతున్న చోటే వంటకాలు సిద్ధం చేస్తున్నారు.

ఈ సోదాలో హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు 110 కిలోల నిల్వ ఉంచిన, కల్తీ రంగులు వేసిన ఫ్రైడ్ చికెన్, ఒక్కొక్కటి 15 లీటర్ల సామర్థ్యం ఉన్న 6 టిన్నుల ప్రమాదకర వంట నూనె, అలాగే పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన కృత్రిమ రసాయన ఆహార రంగులను సీజ్ చేశారు. ఈ అక్రమ నిర్వాహణకు బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసినందుకు గానూ వారిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (FSS Act, 2006)తో పాటు ఐపీసీలోని ఇతర సంబంధిత కఠిన చట్టాల కింద హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (కు అప్పగించారు.

ఆహార కల్తీకి పాల్పడే వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ జీరో-టాలరెన్స్ (సహించేది లేదు) విధానాన్ని అనుసరిస్తుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగర పౌరులకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ గుర్తింపు పొందిన, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే ఆహారాన్ని కొనుగోలు చేయాలి. విపరీతమైన రంగులు కలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. హోటళ్లు లేదా గోదాముల్లో ఇలాంటి అసురక్షిత పద్ధతులు మీ దృష్టికి వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల కొరకు టోల్-ఫ్రీ నంబర్ 8712661212 ను సంప్రదించాల్సిందిగా కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe