...
...
Next Story

సాయికృష్ణది లాకప్‌డెత్.. మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు!

విజయవాడలో గాదె సాయికృష్ణ కేసులో సంచలన విషయాలు బయటకువచ్చాయి. సాయికృష్ణది లాకప్‌డెత్ అని సిట్ నిర్ధారించింది.

Published on: Jun 24, 2026, 14:22:12 IST
Advertisement

గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదొక లాకప్‌డెత్ (పోలీస్ కస్టడీలోనే మరణం) అని, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని ప్రత్యేక విచారణ బృందం (SIT) నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, పోలీసులు ఆయన్ను 2వ ఏజేఎస్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచనల విషయాలు విషయాలను పొందుపరిచారు.

రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు

సాయికృష్ణ కేసు
సాయికృష్ణ కేసు

సాయికృష్ణది ముమ్మాటికీ లాకప్‌డెత్ అని సిట్ స్పష్టం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌పై అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చి, తీవ్రంగా గాయపరచడం వల్లే మరణించాడని పేర్కొంది. అనంతరం ఆధారాలు దొరకకుండా శవాన్ని మాయం చేశారని వెల్లడించింది.

మే 5 నుంచి జూన్ 19 (2026) మధ్య కాలంలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించి ఉంటాడని సిట్ భావిస్తోంది. నిందితుడు సీఐ నాగరాజే స్వయంగా సాక్ష్యాలను నాశనం చేశారని సిట్ తెలిపింది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న పోలీస్ స్టేషన్ సీసీటీవీ డీవీఆర్ డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆ డీవీఆర్‌లను రికవరీ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

మే 5వ తేదీ నుంచి 8వ తేదీల మధ్య సాయికృష్ణ కృష్ణలంక పీఎస్ లోనే ఉన్నాడని, అక్కడే అతడి మృతదేహాన్ని చూశానని సదరు స్టేషన్ ఎస్ఐ వాంగ్మూలం ఇవ్వడం కేసులో అత్యంత కీలకంగా మారింది. స్టేషన్ మహిళా సిబ్బంది హిమజను కూడా సిట్ విచారించింది. 17 మంది సాక్షులను విచారించి వివరాలు సేకరించారు.

శాస్త్రీయ ఆధారాలను రూపుమాపి, సాయికృష్ణను పోలీసు కస్టడీలోనే హత్య చేశారనేందుకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ దారుణం వెనుక ఉన్న పూర్తి కోణాలను, మరిన్ని విషయాలను రాబట్టేందుకు నిందితుడైన సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని సిట్ తన నివేదికలో పేర్కొంది.

'అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందితుడైన నాగరాజును విచారించాలి. జూన్ 2వ తేదీ కంటే ముందే సాయికృష్ణ మరణించాడని విశ్వస్తున్నాం. కస్టడీలో ఉండగా గాయాలపాలై మరణించాడు. ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. పరిణామాలన్నీ గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశారని గుర్తించాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు.' అని సిట్ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks