తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతి పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం….

మార్చి 18వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు… మే 10వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుల స్వీకరణ (పోస్ట్ ద్వారా) ప్రాసెస్ మే 20తో ముగుస్తుంది. ఎంపికైన వారి జాబితాను మే 30వ తేదీన ప్రకటిస్తారు.
జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జూన్ 5 న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ లింక్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఇక ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.450, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1,500గా నిర్ణయించారు.
ఐఐఐటీ ప్రవేశాలు - ముఖ్యమైన అంశాలు :
- ఐఐఐటీ క్యాంపస్ లో ప్రవేశాల కోసం పదో తరగతిపాస్ అయిన విద్యార్థులు అప్లయ్ చేసుకునేందుకు అర్హులవుతారు.
- పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.
- మొత్తం సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు, 15 శాతం అన్-రిజర్డ్వ్ కోటాలో కేటాయిస్తారు.
- మహిళా అభ్యర్థులకు అన్ని కేటగిరీలలో 33 శాతం హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది.
- * గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరీ కింద కేటాయిస్తారు.
- బాసరలోని 1650 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్ లోనూ ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది.
- వయోపరిమితి 01.06.2026 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
- ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. అంటే మొత్తం 24 అదనపు మార్కులు జోడిస్తారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.
- ఒకవేళ ఇద్దరు విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు.
- సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.rgukt.ac.in/