మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా… త్వరలో ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఫైనల్ ఓటర్ జాబితాలను ప్రకటించిన తర్వాత… ఏ క్షణమైనా నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది.
ఈ నెలలోనే నోటిఫికేషన్…?

ఈనెలలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈనెల రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఓవైపు ప్రభుత్వ, మరోవైపు ఎన్నికల సంఘం ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ప్రాథమికంగా కూడా కొన్ని తేదీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన క్షణమే…. ఈసీ నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే సూచనలున్నాయి.
ఈనెల 10న ఫైనల్ ఓటర్ లిస్టులు…!
ఇటీవలనే రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి పరిధిలోని మున్సిపల్, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కలిపి 45 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్జెండర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాపై జనవరి 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
మున్సిపాలిటీల పరిధిలోని ఓటర్లు… ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారి పరిధిలోని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెెళ్లొచ్చు. ఈనెల 4వ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు సమావేశమవుతారు. జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.