ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇటీవలనే హరీశ్ రావు, కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న హాజరు కావాలని ఆదేశించింది.

జనవరి 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీలో సంతోష్ రావు కూడా కీలక నేతగా ఉన్నారు. మరోవైపు సిట్ నోటీసులపై సంతోష్ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని.. సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును సిట్ గతంలో ప్రశ్నించింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి)లో పని చేసిన డీఎస్పీతో సహా నలుగురు పోలీసు అధికారులను మార్చి 2024లో అరెస్ట్ కూడా చేశారు. వివిధ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తొలగించడంతో పాటు గత బిఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.