రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలు పై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమన్వయ సన్నాహాక సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో…. ప్రాజెక్ట్ అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా…..
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో (జీజీహెచ్–1, ఏరియా ఆసుపత్రులు–4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు–5, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు–4, ప్రైమరీ హెల్త్ సెంటర్లు–31, బస్తీ దవాఖానాలు–19) సేవలు ప్రారంభిస్తారు. వచ్చే ప్రతి రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయడానికి కసరత్తును ప్రారంభించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
- రోగి ఆసుపత్రికి వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతిదీ రికార్డ్ చేస్తారు.
- ఓపీ, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్, ఫార్మసీ వంటి అన్ని విభాగాల్లో రోగి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా అవసరమైన ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు.
- డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రోగి పూర్తి వైద్య చరిత్ర డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువస్తారు.
- ఫలితంగా వైద్యులు తక్షణమే సరైన చికిత్స అందించడానికి సౌలభ్యం కలుగుతుందని మంత్రి దామోదర తెలిపారు.
- ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న ఎన్‌సీడీ, కమ్యూనికేబుల్ డిసీజెస్, ఎంసిహెచ్, చైల్డ్ హెల్త్ సేవలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తారు. అవసరమైతే రిఫరల్ సిస్టమ్ ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్న ఈ పైలెట్ ప్రాజెక్టును అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డు అమలు కోసం సంగారెడ్డి జిల్లాలో చేపట్టే ఈ పైలెట్ ప్రాజెక్టు ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.