...
...
Next Story

ఓ వైపు సంక్రాంతి ప్రయాణికుల రద్దీ.. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్!

సంక్రాంతి వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగేలా కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వానికి, ప్రయాణికులకు బిగ్ షాక్ తగలనుంది.

Published on: Jan 08, 2026 10:21 AM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులను ఇప్పటికే ప్రకటించింది. అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ప్రణాళికలు వేసింది ఆర్టీసీ. ఇదే సమయంలో మరో విషయం తెరపైకి వచ్చింది. ఆర్టీసీలోని 2,419 అద్దె బస్సుల యజమానులు ఈ నెల 12 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

అద్దె పెంచాలని అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళల ఉచిత ప్రయాణంతో పడిన అదనపు భారం మేరకు చెల్లింపులు చేయాలని అడుగుతున్నారు. నష్టాలు వస్తున్న కారణంగా తమకు అద్దె పెంచాలని చెబుతున్నారు. ఒకవేళ అద్దె పెంచకపోతే.. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యజమానులు నోటీసులు పంపేందుకు రెడీ అయ్యారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం నడుస్తోంది. దీని ద్వారా బస్సుల నిర్వహణ వ్యయ పెరిగిందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.15వేల నుంచి 20 వేల వరకు అదనంగా ఇవ్వాలని అభ్యర్థించారు.

అద్దె బస్సుల యజమానుల అభ్యర్థనను పరిశీలించిన ఆర్టీసీ.. నెలకు రూ.5200 ఇచ్చేందుకు సర్క్యూలర్ జారీ చేసింది. తమతో చర్చించి అద్దె మెుత్తాన్ని మరింత పెంచాలని వారు చెబుతున్నారు. స్వల్పంగా పెంచిన అద్దెపై అద్దె బస్సుల యజమానుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.

పండుగ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ మొత్తం 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వీటిలో అధిక శాతం సర్వీసులు రాష్ట్ర అంతర్గత మార్గాలకే పరిమితమవుతాయి. వీటిలో 71 శాతానికి సమానమైన 6,000 బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోపలే నడుస్తాయి. మిగిలిన 2,432 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి అంతర్రాష్ట్ర మార్గాల్లో నడిపిస్తారు.

పండుగకు ముందు 3,857 ప్రత్యేక సర్వీసులను నడుపనుంది ఏపీఎస్ఆర్టీసీ. వీటిలో 3,500 బస్సులు రాష్ట్ర అంతర్గత మార్గాల్లో నడుస్తాయి. 240 సర్వీసులు హైదరాబాద్‌కు, 102 బెంగళూరుకు, 15 చెన్నైకి నడుస్తాయి. సాధారణంగా నడిచేవాటికి ఇవి అదనం.

సంక్రాంతి తర్వాత ఏపీఎస్‌ఆర్టీసీ 4,575 ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. వీటిలో 2,500 బస్సులు రాష్ట్రంలోపలే నడుస్తాయి. 1,800 సర్వీసులు హైదరాబాద్‌కు, 200 బెంగళూరుకు, 75 చెన్నైకి నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe