శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది.స్పర్శ దర్శనం,అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.
కౌంటర్ల వివరాలు….

రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని పంపిణీ చేస్తారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.
ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను అందజేస్తారు. కాబట్టి టికెట్లు తీసుకున్న ఈ భక్తులు… ఈ కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చని అధికారులు సూచించారు.
గత నవంబర్ నెలలోనే శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒకరోజు “మల్లన్న స్పర్శ దర్శనం” అవకాశం కల్పించాలని నిర్ణంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు కూడా బోర్డు ఆమోదం తెలపింది.
అదేవిధంగా రూ.500 స్పర్శ దర్శనం టికెట్ పొందిన భక్తులకు 100 గ్రాముల రెండు లడ్డూలు, రూ.300 టికెట్ పొందిన భక్తులకు 100 గ్రాముల ఒక లడ్డూను ఉచితంగా అందించే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్నే డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.