గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen 'Z') పోస్ట్ ఆఫీస్ గా మార్చారు. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విట్ యూనివర్శిటీ క్యాంపస్ లో ప్రారంభించారు.
ప్రత్యేకతలు ఇవే
- జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లు సంప్రదాయ పోస్టల్ కార్యాలయాలను యువత కేంద్రంగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సేవా కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా రూపొందించడం జరిగింది.
- సులభంగా అందుబాటులో ఉండే విధంగా, విద్యార్థులకు అనుకూలమైన ప్రజా సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.
- సాంకేతికత ఆధారిత, వినియోగదారుడి కేంద్రీకృత పరిష్కారాలను స్వీకరించడం ద్వారా యువతలో మారుతున్న అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా పోస్టల్ సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుంది.
- జెన్ జెడ్ పోస్టాఫీస్‌ను ప్రత్యేకంగా జనరేషన్ జెడ్ (Z) యువత అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
- ఇందులో ఆధునిక వాతావరణం, డిజిటల్ చెల్లింపు సదుపాయాలు, సరళీకృత సేవల అందింపు విధానాలు, ఒకే చోట పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలను సమగ్రంగా పొందే అవకాశం ఉంటుంది.
భాగస్వామ్యులను చేయటమే లక్ష్యం - కేంద్రమంత్రి పెమ్మసాని

ఈ సరికొత్త పోస్టాఫీస్ ప్రారంభం సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా దాదాపు 50 జెన్ జెడ్ పోస్టాఫీసులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీలో 3 ఏర్పాటైనట్లు తెలిపారు. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని గుర్తు చేశారు. కేవలం లెటర్స్ బట్వాడాకే పరిమితం కాకుండా కాకుండా ఈ కామర్స్ ప్లాట్ ఫాం గా మార్చామని… ప్రతి ఉద్యోగి తమ విధులు సజావుగా నిర్వహించేలా చూస్తున్నామని చెప్పారు.
“సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులు కు దీటుగా పోస్టాఫీసు లను తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ కోసం ఓ నిపుణుడుని ప్రత్యక అధికారిని నియమించాం. Gen Z పోస్టాఫీసు ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే. పోస్టల్ శాఖలో పెట్టే ఖర్చులతో 89 శాతం జీతాలకు సరిపోతున్నాయి. సామాజిక బాధ్యతగా చేసే కార్యక్రమాల వల్ల మేం ఎక్కువ చార్జీలు వసూలు చేయటం లేదు అందుకే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఆలోచిస్తున్నాం” అని కేంద్రమంత్రి చంద్రశేఖర్ తెలిపారు.