...
...
Next Story

YS Jagan On Mega DSC : 'మెగా డీఎస్సీ కాదు మెగా స్కామ్'.... సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

YS Jagan On Mega DSC : కూటమి ప్రభుత్వం నిర్వహించిన 16,000 పోస్టుల 'మెగా డీఎస్సీ' ఒక భారీ కుంభకోణమని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Published on: Jun 13, 2026 10:01 PM IST
Advertisement

ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన… 16,000 పోస్టుల 'మెగా డీఎస్సీ' ఒక 'మెగా స్కామ్' అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు . ఈ నియామకాల వెనుక ఒక పక్కా ప్రణాళికతో కూడిన చీకటి ఆపరేషన్ జరిగిందని, ఇది లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను నట్టేట ముంచిందన్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ లో… పలు ఆధారాలను…. జీవో కాపీలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు.

వైఎస్ జగన్ ట్వీట్ - ప్రస్తావించిన అంశాలు :

  1. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు గతంలో ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతను ఎస్సీఈఆర్‌టీ (SCERT) కి, పరీక్షల నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్‌కు విడివిడిగా అప్పగించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక భద్రతా నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టింది. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనబెట్టి…. అత్యంత కీలకమైన ఈ రెండు బాధ్యతలను ఒకే ఒక్క వ్యక్తికి, అంటే ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు కట్టబెట్టారు. ఈ అధికారాల కేంద్రీకరణే అవకతవకలకు మొదటి అడుగు అని జగన్ విమర్శించారు.
  2. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధులను ప్రభుత్వ శాశ్వత అధికారులకు కాకుండా అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారు. ఈ క్రమంలోనే ఎస్సీఈఆర్‌టీలో ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో పనిచేసిన ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఏకంగా డీఎస్సీ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం తీవ్ర కలకలం రేపింది. ఇది ముమ్మాటికీ పేపర్ లీకేజీకి ప్రత్యక్ష నిదర్శనమని జగన్ స్పష్టం చేశారు. ఆ అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు…? మెరిట్ లిస్ట్ నుండి అతని డేటాను ఎందుకు తొలగించారు? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు…? అని ఆయన ప్రశ్నించారు. ఈ లీకేజీ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించిందో తేలాలంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐ (CBI) తో విచారణ జరపడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
  3. గతంలో డీఎస్సీ ఫలితాలు వచ్చినప్పుడు అభ్యర్థుల మెరిట్ లిస్టులు, మెరిట్-కమ్-రోస్టర్ జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించే సాంప్రదాయం ఉండేది. కానీ ఈసారి ఆ విధానాన్ని మార్చి కేవలం ఆన్‌లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్‌లకే పరిమితం చేశారు. దీనివల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. రూల్ 20 (Scheme of Selection Rules 2025) ప్రకారం అభ్యర్థుల మార్కులు, కటాఫ్, వర్టికల్ మరియు హారిజంటల్ రిజర్వేషన్లు (దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా) అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మెరిట్-కమ్-రోస్టర్ జాబితా రూపొందించాలి. అందుకనుగుణంగా 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, విజయవంతంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అనేకమంది అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితాలో కనిపించకపోవడం తీవ్ర అన్యాయమని…. బాధిత అభ్యర్థులు తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్లలో గానీ, హెడ్ ఆఫీసులో గానీ ఎవరూ అందుబాటులో లేరని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
  4. ఈ స్కామ్‌లో అత్యంత దారుణమైన విషయం స్పోర్ట్స్ కోటాను హ్యాండిల్ చేసిన విధానమేనని జగన్ ధ్వజమెత్తారు. గతంలో అమలులో ఉన్న జీవో నంబర్ 74 (తేదీ: 09 ఆగస్టు 2012) ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డీఎస్సీ రాత పరీక్ష రాసి క్వాలిఫై కావడం తప్పనిసరి. అయితే…. దీనిని మారుస్తూ 10 డిసెంబర్ 2024న జీవో నంబర్ 8 తెచ్చారు. ఆ తర్వాత జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ద్వారా క్రీడాకారులకు డీఎస్సీ రాత పరీక్ష రాయడం నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. కేవలం ఏదైనా క్రీడలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ (TDP నేతలు ఇచ్చినట్లుగా చెప్తున్న ధృవీకరణ పత్రాలు) ఉంటే నేరుగా ఉద్యోగం వచ్చేలా బ్యాక్‌డోర్ ఎంట్రీ కల్పించారు. తమకు కావాల్సిన వారిని ఈ దొడ్డిదారిన ఉద్యోగాల్లోకి తీసుకున్న వెంటనే.. నియామక ప్రక్రియ ముగిసిపోగానే, క్రీడాకారుల నుండి అభ్యంతరాలు వచ్చాయనే నెపంతో జీవో నంబర్ 23, 25 మరియు 56లను జారీ చేస్తూ పాత పరీక్ష విధానాన్ని మళ్లీ పునరుద్ధరించారు. అంటే…. పని పూర్తయ్యాక దొడ్డిదారి తలుపులు మూసేశారు. ఇదే కాకుండా…. ఒక ఉపాధ్యాయ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియో బయటకు వచ్చినా, పోలీసులు కేవలం నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను వదిలేశారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడి ఫోన్ నంబర్ తెలిసినా పేరు నమోదు చేయకుండా దాటవేశారని జగన్ మండిపడ్డారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్

రాష్ట్రంలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నీ ఈ కుంభకోణానికి కారకులైన పెద్దల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి… ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు నిరుద్యోగుల ముందుకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe