Bandi Bhagirath POCSO Case : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా విచారణకు దూరంగా ఉన్న బండి భగీరథ్…. తన న్యాయవాదులతో కలిసి స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరయ్యారు.
చట్టానికి లోబడి ఉండాల్సిందే - బండి సంజయ్

ఈ పరిణామంపై భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. "సత్యమేవ జయతే.. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. మనమందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే," అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని… వాస్తవానికి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించినట్లు మంత్రి తెలిపారు. అయితే, లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచడం వల్ల కొంత సమయం పట్టిందని వివరించారు. ఈ కేసు నిలబడదని…. కచ్చితంగా బెయిల్ వస్తుందని న్యాయవాదులు భరోసా ఇచ్చారని, ఆ కారణంగానే పోలీసుల ముందుకు రావడంలో కొంత జాప్యం జరిగిందని ఆయన అంగీకరించారు.
శనివారం కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పినప్పటికీ…. ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే లాయర్ల ద్వారా తన కుమారుడిని పోలీసుల విచారణకు అప్పగించినట్లు స్పష్టం చేశారు.
న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన నమ్మకం ఉందని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. వచ్చే సోమవారం రోజు కోర్టు నుంచి కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ…. చట్టాన్ని గౌరవిస్తూ అంతవరకు ఆగకుండా పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణకు పంపించానని ఆయన వెల్లడించారు. భగీరథ్ లొంగిపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారు.