...
...
Next Story

'ఇదా సీఎం వాడే భాష..? కొడంగల్ లో కూడా నిన్ను గెలవనీయం' - రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడినని.. మాట్లాడమంటే ఉర్దూలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టే తెలివి ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడిస్తామని కామెంట్ చేశారు.

Published on: Dec 26, 2025 03:39 PM IST
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారు అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేకనే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రశ్నిస్తే తప్పా…? కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ భవన్ లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "మొన్న కేసీఆర్ గారు ఏమడిగారు? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పండపెట్టినవు అని అడిగారు. ఎనిమిది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వెనక్కి పంపినా, దానిని మళ్ళీ పంపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సోయి ఈ ముఖ్యమంత్రికి ఉందా? 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్లు వస్తాయి, ఆ పని చేయమని అడగడం తప్పా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.🔸

కృష్ణా జలాల విషయంలో మోదీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.

“ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? నెలకు రూ. 4000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు రూ. 2500 ఇస్తామని 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు ఏమయ్యాయి? రెండేళ్లు దాటినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడం ఏంటి..?” అని కేటీఆర్ నిలదీశారు.

"ఢిల్లీలో పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, ఇప్పుడు కూడా నెల నెలా ఢిల్లీకి పైసలు పంపిస్తూ పదవి కాపాడుకుంటున్నావు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలని… కానీ మీలో రోజూ ఈ ఏడుపు ఎందుకు?" అని కేటీఆర్ నిలదీశారు.

"నీ అమ్మ, నీ అయ్య.. గీదా నీకు నేర్పిన భాష? గత రెండేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం, కేవలం తిట్లు తిట్టడం తప్ప నీకు ఏమీ రాదు. కుర్చీకి ఇచ్చే గౌరవంతోనే ఊరుకుంటున్నాం. నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి పదవి దక్కింది. కానీ నీ తీరు చూస్తుంటే 'కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టు' ఉంది" అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

"నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు నొప్పి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది. ఆ సమయంలో నేను గుంటూరులోనే కాకుండా హైదరాబాద్, పూణే, అమెరికా.. ఇలా ప్రపంచమంతా చదువుకున్నాను" అని స్పష్టం చేశారు. నేను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంటున్న రేవంత్… ఆంధ్రా నుంచి అల్లుణ్ణి తెచ్చుకోవడం తప్పు కాదా? అందుకే ఈయనకు 'భీమవరం బుల్లోడు' అని పేరు పెడితే సరిపోతుంది" అని ఎద్దేవా చేశారు.

కొడంగల్ లో ఓడిస్తాం - కేటీఆర్

"కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని కానీయను అని శపథాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఒకటే చెబుతున్నా.. నీకు సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చెయ్. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్‌లో కూడా గెలవనీయకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి" అని కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe