...
...
Next Story

Warngal UGD Project : గ్రేటర్ వరంగల్‌కు మహర్దశ..! భూగర్బ డ్రైనేజీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్, రూ.5257 కోట్లు మంజూరు

Warngal UGD project : గ్రేటర్ వరంగల్‌ కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.5,257 కోట్లు మంజూరు చేసింది.ఇప్పటికే ఈ పనుల కోసం అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించారు.

Published on: Mar 8, 2026, 07:43:02 IST
Advertisement

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ. 5257 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గ్రేటర్ వరంగల్ కు భారీ ప్రాజెక్ట్
గ్రేటర్ వరంగల్ కు భారీ ప్రాజెక్ట్

రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే నగరంలో భారీ వర్షాలు కురిస్తే చాలు… మురుగు నీరు ఏరులై పారుతోంది. దీనికి ప్రధాన కారణం… భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం. బహిరంగ నాలాలు ఉండటంతో… మురుగునీరు ఏరులై పారే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తుండగా… ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది.

మూడు దశలలో నిధులను వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భూగర్భంలో కాలువల వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. అలాగే వర్షపునీటి ప్రవాహం-యాజమాన్య వ్యవస్థ, నీటిసరఫరా, చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటారు. భూగర్భ డ్రైనేజీ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది.

  • గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 5,257.20 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల (UGD) ప్రాజెక్ట్ - ఫేజ్ 1కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర నిధులతో చేపడుతున్నారు.
  • కేంద్ర ప్రభుత్వం వాటాగా 25 శాతం (రూ.1,314.30), రాష్ట్ర ప్రభుత్వం వాటా 25 శాతం (రూ.1,314.30 కోట్లు) ఉండగా… మిగతా 50 శాతం నిధులను బ్యాంకు రుణం లేదా పీపీపీ పద్ధతిలో సమకూర్చుస్తారు.
  • భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులపై కేఎఫ్‌డబ్ల్యూ ఆసక్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌ను అధ్యయనం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రాథమికంగా అంగీకరించింది.
  • ఈ నేపథ్యంలో వరంగల్‌లో ఫేజ్‌-1 కింద రూ.5,257.20కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.

దోమల నివారణ , మురుగునీటి వల్ల వచ్చే వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి. వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరు కాలువల ద్వారా వెళ్లడం వల్ల వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచే సమస్య తప్పుతుంది. వరంగల్ నగరానికి ఐటి కంపెనీలు మరియు ఇతర పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు అనుమతులు రావటంతో… ఓరుగల్లు నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks