...
...
Next Story

ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు స్టార్ట్.. జూన్ 1 నుంచి తరగతులు.. ఇవి తప్పనిసరి

TG Inter 1St Year Admissions : తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ మెుదలైంది. మే 12వ తేదీ నుంచి సవరించిన షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు జరుగుతున్నాయి.

Published on: May 12, 2026, 07:34:10 IST
Advertisement

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సవరించింది. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు, కఠిన నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

అడ్మిషన్ల సందడి

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లు
తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లు

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 8 నుంచే ప్రవేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. తాజాగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు.

పాఠశాల విద్యలో విలీనం వెనక్కు

నిజానికి ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావించింది. అయితే, ఈ హడావిడి నిర్ణయంపై పలు విద్యా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ విద్యా సంవత్సరానికి పాత విధానంలోనే (ఇంటర్ బోర్డు పరిధిలోనే) ప్రవేశాలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుత ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో సీబీఎస్ఈ నమూనాలో 11, 12 తరగతులను ప్రవేశపెట్టాలని తెలంగాణ విద్యా కమిషన్ గతంలో సిఫార్సు చేసింది. ఇలా చేయడం వల్ల విద్యార్థులు చదువు మానేయడాన్ని తగ్గించవచ్చని కూడా వాదించింది. ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంతో ఏకీభవించింది.

ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో ప్రభుత్వం రెండు నిబంధనలను చాలా సీరియస్‌గా అమలు చేస్తోంది: ఆధార్ కార్డు, యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇవ్వాలి. ప్రతీ విద్యార్థి ప్రవేశం పొందే సమయంలో తమ గుర్తింపు కార్డుగా ఆధార్‌ను సమర్పించడం తప్పనిసరి చేశారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ సమయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు కూడా మేం మత్తు పదార్థాలను వినియోగించబోం, విక్రయించబోం అని రాసి ఉన్న అఫిడవిట్‌పై సంతకం చేసి కళాశాలకు సమర్పించాల్సి ఉంటుంది.

తల్లిదండ్రులకు సూచన

జూన్ 1వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సీట్లను త్వరగా రిజర్వ్ చేసుకోవాలని బోర్డు సూచించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అఫిడవిట్లు సమర్పించని పక్షంలో ప్రవేశాలు నిరాకరించే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks