...
...
Next Story

ఈనెల 10న ఏపీకి కేంద్రం బృందం - తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటన

తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. ఈ మేరకు ఈనెల 10,11 తేదీల్లో ఈ బృందాలు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించగా… కేంద్ర బృందాలు కూడా పరిశీలించి ఓ నివేదికను అందజేస్తాయి.

Published on: Nov 9, 2025, 06:02:10 IST
Advertisement

రాష్ట్రంలోని 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నెల 10,11 తేదీల్లో ఆయా బృందాలు… క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తాయి. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టాల్ని పరిశీలిస్తాయి.

2 బృందాలుగా పర్యటన…

మెుంథా తుపాను పంట నష్టం
మెుంథా తుపాను పంట నష్టం

మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఎడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం) ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తుంది. సోమ, మంగళవారాల్లో ఈ పర్యటన ఉంటుందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

రెండు టీమ్ లుగా ఏర్పడి ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను అంచనా వేస్తారు. సోమవారం టీమ్-1 బాపట్ల జిల్లాలో, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

ఇక మంగళవారం టీం-1 ప్రకాశం జిల్లాలో , టీం-2 కోనసీమ జిల్లాల్లో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.

కేంద్రానికి ఏపీ నివేదిక..!

మరోవైపు ఇటీవలనే మొంథా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక నివేదికను పంపారు.

17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారమే నివేదిక సమర్పించామని, పూర్తి స్థాయిలో వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రానికి తక్షణ ఆర్ధిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రాథమిక నివేదికలో అంశాలవారీగా ఏయే శాఖలు, ఏయే రంగాల వారీగా ఎంతమేర నష్టం వాటిల్లిందన్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది.

రాష్ట్ర ప్రభుత్వ అంచనాలతో పాటు కేంద్ర బృందం ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్రం నుంచి సాయం అందే అవకాశం ఉంటుంది. ఇది ఎంత వరకు ఇస్తారనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe