...
...
Next Story

శిల్పా శెట్టికి ఊరట: ఆ అసభ్యకర వీడియోలను వెంటనే తొలగించండి.. బాంబే హైకోర్టు

నటి శిల్పా శెట్టి వ్యక్తిగత గోప్యతను హరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. గౌరవంగా జీవించే హక్కు ఎవరికైనా ఉంటుందని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

Published on: Dec 27, 2025 07:19 AM IST
Advertisement

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి బాంబే హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సోషల్ మీడియా వేదికలపై ఆమెకు సంబంధించి ప్రచారమవుతున్న అసభ్యకరమైన మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కంటెంట్ ఆమె వ్యక్తిగత గోప్యతను, గౌరవాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది.

అవి చూస్తుంటేనే ఇబ్బందిగా ఉంది - హైకోర్టు

శిల్పా శెట్టికి ఊరట: ఆ అసభ్యకర వీడియోలను వెంటనే తొలగించండి.. బాంబే హైకోర్టు
శిల్పా శెట్టికి ఊరట: ఆ అసభ్యకర వీడియోలను వెంటనే తొలగించండి.. బాంబే హైకోర్టు

ఈ కేసును విచారించిన జస్టిస్ అద్వైత్ సేత్నా ఏకసభ్య ధర్మాసనం, సోషల్ మీడియాలో ఉంచిన ఆ కంటెంట్‌ను పరిశీలించిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

"సోషల్ మీడియాలో ఉన్న ఈ కంటెంట్ అత్యంత అభ్యంతరకరంగా ఉంది. ఏ వ్యక్తినీ వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసేలా చిత్రించడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది" అని జస్టిస్ అద్వైత్ సేత్నా వ్యాఖ్యానించారు.

పర్సనాలిటీ రైట్స్ కోసం న్యాయపోరాటం

తన పేరు, గొంతు, ప్రతిరూపం (Image), సంతకం వంటి వ్యక్తిగత గుర్తింపులను తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ నవంబర్ 25న శిల్పా శెట్టి హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తున్న 28 సంస్థలను ఆమె తన పిటిషన్‌లో నిందితులుగా పేర్కొన్నారు.

శిల్పా శెట్టి తరపు న్యాయవాది సనా రైస్ ఖాన్ వాదిస్తూ.. "వివిధ ఈ-కామర్స్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు శిల్పా శెట్టి సినిమాల్లోని క్లిప్పింగులను, ఆమె పబ్లిక్ అప్పియరెన్స్‌లను ఆమె అనుమతి లేకుండా ఎండార్స్‌మెంట్ల కోసం వాడుకుంటున్నాయి. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఆమెను ఎగతాళి చేసేలా క్యారికేచర్లు, డీప్‌ఫేక్ అశ్లీల వీడియోలను సృష్టించి ఆమె మర్యాదకు భంగం కలిగిస్తున్నారు" అని కోర్టుకు వివరించారు.

ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

ఇంటర్నెట్‌లో ఉన్న అభ్యంతరకరమైన లింకులు, పోస్టులన్నింటినీ వెంటనే బ్లాక్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖను (DoT) ఆదేశించింది. కేవలం కొన్ని లింకులను బ్లాక్ చేయడం సరిపోదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్వినియోగం జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది.

కాగా, చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ నటీమణుల డీప్ ఫేక్ వీడియోలు ఇప్పటికే ఇన్‌‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్ మీడియా వేదికలను ముంచెత్తడం ఆందోళనకర పరిణామంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe