...
...
Next Story

Ram temple theft : ఆరోపణల నుంచి సిట్ దర్యాప్తు, అరెస్ట్ వరకు.. అయోధ్య రామాలయ విరాళాల కేసులో ఏం జరిగింది?

Ram temple donation row : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన వేళ ఆలయ విరాళాల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజకీయంగా, సిద్ధాంతపరంగా పెద్ద సవాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు.

Published on: Jun 27, 2026 10:43 AM IST
Advertisement

అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాల విషయంలో తలెత్తిన అవకతవకల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తుల నమ్మకం, సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కీలక నిందితులతో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది.

రూ. 7.5 కోట్ల గోల్‌మాల్ ఆరోపణలతో మొదలైన దుమారం

అయోధ్య రామ మందిర విరాళాల కేసులో అరెస్ట్​ అయినవారు..
అయోధ్య రామ మందిర విరాళాల కేసులో అరెస్ట్​ అయినవారు..

ఈ వివాదం జూన్ 7న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు పవన్ పాండే చేసిన ఆరోపణలతో వెలుగులోకి వచ్చింది. ఆయోధ్య రామ మందిరంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకల నుంచి దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల వరకు విరాళాలు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. అయితే, అదే రోజు ఈ ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోసిపుచ్చారు. భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయికీ లెక్కలు ఉన్నాయని, ఆడిటింగ్ పక్కాగా జరుగుతోందని స్పష్టం చేశారు.

కానీ ఈ వ్యవహారంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేశారు. ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్ జూన్ 25న స్వయంగా సిట్ (సిట్) ఎదుట హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. మరోవైపు అయోధ్య స్థానిక బీజేపీ నేత రజనీష్ సింగ్ కూడా దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం గమనార్హం. దీనితో ప్రధాని కార్యాలయం సైతం జూన్ 23న ట్రస్ట్ నుంచి వాస్తవ నివేదికను కోరింది.

సీఎం యోగి యాక్షన్ ప్లాన్.. రంగంలోకి సిట్

జూన్ 15 నుంచి 20 మధ్య దర్యాప్తు అధికారులు ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, నగదు లెక్కింపు సిబ్బందితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధికారులను కూడా విచారించారు. సిబ్బంది నియామక ప్రక్రియ, సీసీటీవీ నిఘా, నగదు, బంగారం, వెండి వస్తువుల అకౌంటింగ్ పద్ధతులను నిశితంగా పరిశీలించారు. దాదాపు 150 మందిని దర్యాప్తు పరిధిలోకి తెచ్చి, రెండు డజన్ల మందిని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో నిందితుల నుంచి భారీగా నగదు, విలువైన వస్తువులను రికవరీ చేశారు. ఆలయం లోపల కేవలం 45 రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉండటంపై దర్యాప్తులో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నివేదిక సమర్పణ.. ఎనిమిది మంది అరెస్ట్..

జూన్ 23న సిట్ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని, విరాళాల నిర్వహణలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగా జూన్ 25న ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నగదు లెక్కింపు విభాగంలో పనిచేసే ఇన్‌ఛార్జ్‌తో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 80 లక్షల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు.

గతంలో 2021లో కూడా మందిరం చుట్టుపక్కల భూముల కొనుగోలుపై ఆరోపణలు వచ్చినప్పటికీ, అవి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయి. కానీ, ఈసారి ఏకంగా బీజేపీ ప్రభుత్వమే స్వయంగా సిట్ దర్యాప్తునకు ఆదేశించడం, ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం, అరెస్టులు జరగడం ఈ కేసు ప్రాధాన్యతను పెంచింది. రాబోయే రోజుల్లో ఈ విచారణ పరిధి మరికొంత మంది పెద్ద వారికి కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe