ప్రముఖ ప్రీమియం బైక్ తయారీ సంస్థ KTMలో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధమైంది. బజాజ్ మొబిలిటీ ఏజీ (Bajaj Mobility AG) తన గ్లోబల్ రైట్‌సైజింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 2025లో చేపట్టిన సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియ ముగియడంతో, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఎందుకు ఈ నిర్ణయం?

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బజాజ్ ఆటో ఈ వివరాలను వెల్లడించింది. "దీర్ఘకాలికంగా మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడేందుకు, సంస్థాగత నిర్మాణాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు తప్పడం లేదు" అని కంపెనీ పేర్కొంది. అంతర్గత ఖర్చులను తగ్గించడం, ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోను పరిమితం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్ నెట్‌వర్క్‌ను పునర్వ్యవస్థీకరించడం వంటి లక్ష్యాలతో ఈ ‘రైట్‌సైజింగ్’ చేపడుతున్నట్లు వివరించింది.
ఎవరిపై ప్రభావం?
ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా వైట్ కాలర్ ఉద్యోగులు (ఆఫీస్ స్టాఫ్) మరియు మధ్య స్థాయి మేనేజ్‌మెంట్ విభాగాలపై ఉండనున్నాయి. డిసెంబర్ 31, 2025 నాటికి ఉన్న గణాంకాల ప్రకారం.. KTMలో మొత్తం 3,794 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన 500 మంది తొలగింపు అంటే, సంస్థ తన మొత్తం శ్రామిక శక్తిలో గణనీయమైన భాగాన్ని తగ్గించుకుంటున్నట్లు అర్థమవుతోంది.
మెజారిటీ వాటా బజాజ్ చేతికే..
గతంలో పియరర్ మొబిలిటీ (PIERER Mobility AG) గా ఉన్న ఈ సంస్థ పేరును బజాజ్ మొబిలిటీ ఏజీగా మార్చారు. ఆస్ట్రియా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ KTMతో పాటు హస్క్వర్నా (Husqvarna), గ్యాస్‌గ్యాస్ (GASGAS) వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లకు మాతృ సంస్థ. గత ఏడాది నవంబర్‌లో బజాజ్ ఆటో తన అనుబంధ సంస్థ ‘బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బివి’ ద్వారా KTMలో మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఒకప్పుడు మైనారిటీ ఇన్వెస్టర్‌గా ఉన్న బజాజ్, ఇప్పుడు మెజారిటీ యజమానిగా మారి KTM భవిష్యత్తు వ్యూహాలను స్వయంగా నిర్దేశిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ రంగ పరిస్థితులు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా తన లాభదాయకతను కాపాడుకునేందుకు బజాజ్ ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ రంగ పరిస్థితులు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా తన లాభదాయకతను కాపాడుకునేందుకు బజాజ్ ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
{{/usCountry}}