...
...

బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే క్లీన్ స్వీప్.. నితీష్‌కే మళ్లీ పట్టం

Nov 14, 2025 04:40 pm IST

  • బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాల్లో మొత్తం 243 సీట్లకు గాను 180కి పైగా సీట్లలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉండగా, మహా కూటమి 36 సీట్లకు పరిమతమైంది. లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

Advertisement
Summary

బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే ఘన విజయం.. కూటమి 36 సీట్లకు పరిమితం.

బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే క్లీన్ స్వీప్.. నితీష్‌కే మళ్లీ పట్టం(HT_PRINT)

బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు. ...Read More

 

Follow all the updates here:

  • Nov 14, 2025 04:40 pm IST

    10 వేల ఆధిక్యంలో తేజస్వీ యాదవ్

    ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 24వ రౌండ్‌కు వచ్చేసరికి 10,276 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంతకుముందు ఆయన బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ కంటే 3 వేల ఓట్ల పైచిలుకు వెనకంజలో ఉన్నారు. మళ్లీ పుంజుకుని భారీ ఆధిక్యం దిశగా వెళుతున్నారు.

  • Nov 14, 2025 04:03 pm IST

    ఐదో అతి పెద్ద పార్టీగా ఎంఐఎం.. దారుణంగా కాంగ్రెస్ పొజిషన్

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్న ఫలితాలమేరకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ 6 స్థానాలతో ఐదో అతి పెద్ద పార్టీగా నిలవగా, కాంగ్రెస్ కేవలం 2 సీట్లలోనే ముందంజలో ఉండి (ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను బట్టి) 8వ స్థానంలోకి పడిపోయింది.

  • Nov 14, 2025 03:36 pm IST

    94 సీట్లలో బీజేపీ ముందంజ

    బీహార్ అసెంబ్లీలో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలవబోతోంది. ఇప్పటి వరకు 94 సీట్లలో ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమిలోని మరో పార్టీ జేడీయూ 84 సీట్లలో ముందంజలో ఉంది. మరో కీలక మిత్ర పక్షం లోక్ జనశక్తి (రాంవిలాస్) పార్టీ 19 సీట్లలో ముందంజలో ఉంది.

  • Nov 14, 2025 02:26 pm IST

    ‘ఎన్డీయే పంచ పాండవులతో సమానం’

    ఎన్‌డీఏ కూటమి విజయంపై తనకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చాటుకుంటూ, అమిత్ షా మహాభారతంతో పోల్చారు. మహాఘట్‌బంధన్‌లో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ 'పంచ పాండవుల' వలే ఐక్యంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. "ఈ ఎన్నికలు కేవలం మా అభ్యర్థులను శాసనసభ్యులుగా లేదా మంత్రులుగా చేయడానికే కాదు. బిహార్‌ను మళ్లీ 'జంగిల్ రాజ్' (అటవీ పాలన) నుంచి విముక్తం చేయడానికి ఉద్దేశించినవి" అని షా ఉద్ఘాటించారు. ఎన్‌డీఏలో ఐదుగురు మిత్రపక్షాలు పాండవుల వలే కలిసికట్టుగా పోరాడుతున్నాయని షా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం, చిరాగ్ పాశ్వాన్ యువ శక్తి, జితన్ రామ్ మాంఝీ జీవితకాల అంకితభావం, ఉపేంద్ర కుష్వాహా అనుభవం.. ఈ ఐదుగురి కలయికతో ఏర్పడిన ఎన్‌డీఏ విజయం ఈ ఎన్నికల యుద్ధంలో ఖాయమని అమిత్ షా ఇటీవలే ప్రచారంలో అన్నారు.

  • Nov 14, 2025 02:24 pm IST

    లాలూ-రాహుల్ ఆట సమాప్తం.. అమిత్ షా వ్యాఖ్య

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్‌డీఏ (NDA) కూటమికి అనుకూలంగా వస్తున్న తరుణంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం (నవంబర్ 12న) సమస్తిపూర్‌లో జరిగిన ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీల 'ఆట' సమాప్తమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "నేను బిహార్ రాష్ట్రమంతటా పర్యటించాను. ఎక్కడికెళ్లినా ఇంతే భారీ జనసందోహాన్ని చూశాను. నవంబర్ 14 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 9 గంటలకు బ్యాలెట్ పెట్టెలు తెరుచుకుంటాయి. ఒకటి అయ్యేసరికి లాలూ, రాహుల్‌ల ఆట సమాప్తమవుతుంది” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

  • Nov 14, 2025 01:57 pm IST

    మహాకూటమికి షాక్: తేజస్వీ యాదవ్ వెనుకంజ

    ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి వెనకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ తేజస్వీ యాదవ్ పై 3,230 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • Nov 14, 2025 01:52 pm IST

    డబుల్ సెంచరీ మార్కు దాటిన ఎన్డీయే కూటమి

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి చారిత్రక విజయం నమోదు చేయబోతోంది. 243 సీట్లకు గాను 201 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. ఈ కూటమిలోని బీజేపీ 91, జేడీయూ 81, లోక్ జన్‌శక్తి (రాంవిలాస్) పార్టీ 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి 36 సీట్లకు పరిమితమవుతోంది.

  • Nov 14, 2025 12:52 pm IST

    మహాఘట్‌బంధన్ కు షాక్

    తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమికి ఈ ఫలితాలు పెద్ద షాక్‌నిచ్చాయి. ఈ కూటమి 50 సీట్ల మార్కును కూడా దాటడానికి నానా తంటాలు పడుతోంది. పోల్ సర్వేలు మహాఘట్‌బంధన్‌కు గరిష్టంగా 118 సీట్ల వరకు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేశాయి. కానీ ఘోర పరాజయం వైపు పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈసీఐ గణాంకాల ప్రకారం ఇప్పుడు ఈ కూటమి 42 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ 32 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 4 సీట్లలో ఆధిక్యంలో, సీపీఐ (ఎంఎల్) (ఎల్) 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

  • Nov 14, 2025 12:49 pm IST

    ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి.. 192 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యత

    చాలావరకు ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డీఏకు 130 నుంచి 172 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. హోంమంత్రి అమిత్ షా బిహార్‌లో ఎన్‌డీఏ 160 నుంచి 180 సీట్ల వరకు గెలుచుకుంటుందని విశ్వాసంగా పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ దాటి ఇప్పుడు ఎన్నికల సంఘం (ECI) ట్రెండ్స్ ప్రకారం బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్‌డీఏ 192 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • Nov 14, 2025 12:15 pm IST

    డబ్బు పంపిణీ చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు: అశోక్ గెహ్లాట్

    బిహార్ ఎన్నికలకు ముందు మహిళలకు 10,000 చొప్పున పంపిణీ జరిగిందని, కానీ దీనిపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్య తీసుకోలేదని రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.

  • Nov 14, 2025 12:01 pm IST

    3 స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యం

    అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలోనూ ఆధిక్యత కనబరచలేకపోతోంది.

  • Nov 14, 2025 12:00 pm IST

    మహాఘట్‌బంధన్ పరిస్థితి దారుణం

    తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కేవలం స్థానాలకు పరిమితమై, భారీగా వెనుకబడింది. కూటమి మొత్తంగా 50 స్థానాలకే పరిమితమైంది.

  • Nov 14, 2025 11:58 am IST

    బిహార్ ఎన్నికల ఫలితాలు 2025: NDA తిరుగులేని ఆధిక్యం

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం 243 సీట్లలో మెజారిటీ మార్కు అయిన 122 స్థానాలను దాటి, భారీ విజయం దిశగా పయనిస్తోంది. బీజేపీ 84 సీట్లలో, జేడీయూ 77 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 22 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

  • Nov 14, 2025 11:12 am IST

    ఒకే కూటమిలో బీజేపీ, జేడీయూ పోటాపోటీగా గెలుపు

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. ఇందులోని రెండు ప్రధాన పార్టీలు నేనంటే నేనంటూ భారీగా సీట్లను కైవసం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు బీజేపీ 82 సీట్లు, జేడీయూ 80 సీట్లలో ముందంజలో ఉండడం విశేషం.

  • Nov 14, 2025 10:44 am IST

    నితీష్ కుమార్ చాణక్యం: ఎప్పటికీ తగ్గని పట్టు

    బిహార్‌ ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పనిచేసిన రికార్డు నితీష్ కుమార్ సొంతం. ఈసారి కూడా ఆయన పునరాగమనం అత్యంత ముఖ్యమైన అంశంగా నిలుస్తోంది. 2020లో సాధించిన 43 అసెంబ్లీ స్థానాల సంఖ్యను జేడీ(యూ) ఈసారి మెరుగుపరుచుకునే దిశగా వెళ్తోంది.

    నితీష్ కుమార్ తన ప్రధాన ఓటు బ్యాంకు అయిన మహిళలను, అలాగే అత్యంత వెనుకబడిన తరగతులను (EBC) పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించగలిగారు. ఇది ఆయన రాజకీయ చతురత, పదునైన వ్యూహం చెక్కుచెదరలేదని రుజువు చేసింది.

  • Nov 14, 2025 10:43 am IST

    కాంగ్రెస్ బలహీనత: మహాకూటమికి దెబ్బ

    మహాకూటమి లేదా గ్రాండ్ అలయన్స్‌కు ఈ ఫలితాల్లో దెబ్బ తగలడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తోంది. 'పునరుత్తేజం'పై అంచనాలతో కాంగ్రెస్ పార్టీకి 60కి పైగా సీట్లు కేటాయించడం చాలా ఖరీదైన తప్పిదంగా మారింది.

    కాంగ్రెస్ 2020లో గెలిచిన 19 సీట్ల కంటే తక్కువ సంఖ్యలోనే గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లు సుమారు 11 స్థానాల్లో "స్నేహపూర్వక పోరాటాలు" (Friendly Fights) చేసి పోటీ పడటం, పొత్తులను పటిష్టం చేయడంలో కాంగ్రెస్ అసమర్థతను ఎత్తిచూపుతోంది. ఇది భవిష్యత్ రాజకీయాలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపడం ఖాయం.

  • Nov 14, 2025 10:15 am IST

    ఆర్‌జేడీ ఎదురీత

    తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్‌జేడీ 61 స్థానాల్లో ఆధిక్యం చూపుతూ గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ, మహాకూటమి మొత్తం ఆధిక్యంలో వెనుకబడింది. మొత్తంగా మహా కూటమి 77 సీట్లలో ముందంజలో ఉంది.

  • Nov 14, 2025 10:00 am IST

    జితన్ రామ్ మాంఝీ ప్రభావం

    గయ జిల్లాలోని ఇమామ్‌గంజ్ నియోజకవర్గం జితన్ రామ్ మాంఝీకి సాంప్రదాయకంగా బలమైన స్థానం. ఆయన ఇక్కడి నుంచి 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి, నియోజకవర్గంపై పట్టును నిలుపుకున్నారు. గతేడాది, మాంఝీ లోక్‌సభకు ఎన్నికవ్వడంతో జరిగిన ఉపఎన్నికలో ఆయన కోడలు దీపా మాంఝీ గెలుపొందారు. దీంతో ఈ ప్రాంతంలో మాంఝీ కుటుంబ ప్రభావం మరింత పటిష్టం అయింది. ఈసారి ఇమామ్‌గంజ్‌లో హెచ్.ఏ.ఎం. నుంచి దీపా మాంఝీ, ఆర్‌జేడీ నుంచి రితు ప్రియా చౌదరి, అలాగే జన్ సూరాజ్ పార్టీ నుంచి డాక్టర్ అజిత్ కుమార్ పోటీలో ఉండటంతో ఇది త్రిముఖ పోరుగా మారింది. జితన్ రామ్ మాంఝీ ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. (NDA) ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

  • Nov 14, 2025 09:59 am IST

    ఇమామ్‌గంజ్‌లో జితన్ రామ్ మాంఝీకి తొలి సవాల్: వెనుకబడిన కోడలు దీపా మాంఝీ, ఆధిక్యంలో ఆర్‌జేడీ

    కేంద్ర మంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి కంచుకోటగా భావించే ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానంలో తొలి ట్రెండ్స్‌లో ఉత్కంఠ నెలకొంది. మాంఝీ కోడలు, హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) అభ్యర్థి దీపా మాంఝీ వెనుకబడి ఉన్నారు. ఆమెపై ఆర్జేడీ అభ్యర్థి రితు ప్రియా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు (PValue డేటా ప్రకారం). మాంఝీ రాజకీయ వారసత్వం, ఆయన పార్టీ భవితవ్యం పరీక్షకు నిలిచే ఈ స్థానం ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Nov 14, 2025 09:57 am IST

    జేడీయూ దూకుడు: 76 సీట్లలో ముందంజ

    బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీగా జేడీయూ నిలిచే అవకాశం కనిపిస్తోంది. పోటీ చేసిన 101 సీట్లలో జేడీయూ ఇప్పటివరకు 76 సీట్లలో ముందంజలో ఉంది. ఇదే ఎన్డీయే కూటమిలోని బీజేపీ 69 సీట్లలో ముందంజలో ఉంది.

  • Nov 14, 2025 09:41 am IST

    రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ఆధిక్యం.. సోదరుడు తేజ్ ప్రతాప్‌కు మహువాలో ఎదురుదెబ్బ

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉదయం 9:05 గంటల నాటికి (PValue డేటా ప్రకారం) రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, RJDతో విబేధించి 'జనశక్తి జనతా దళ్ (JJD)' పేరుతో కొత్త పార్టీ పెట్టిన ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. మహువా నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యం చూపినా, ఆ తర్వాత వెనుకబడ్డారు. బిహార్ రాజకీయాల్లో అన్నదమ్ముల మధ్య ఈ పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • Nov 14, 2025 09:31 am IST

    150 సీట్లలో ఎన్డీయే కూటమి ముందంజ

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ఇప్పటివరకు మొత్తం 243 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 150 సీట్లలో ముందంజలో ఉంది.

  • Nov 14, 2025 09:17 am IST

    మెజారిటీ మార్కు దాటిన ఎన్డీయే ఆధిక్యత

    బీహార్ లో అధికారం దక్కాలంటే మొత్తం 243 సీట్లలో 122 సీట్లు దక్కాలి. ఎన్డీయే ఇప్పటికే 126 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. ఇవీ ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ ఎన్డీయే దూకుడు ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.

  • Nov 14, 2025 09:14 am IST

    ఆధిక్యంలో ఉన్న ముగ్గురు 'జన్ సురాజ్' అభ్యర్థులు వీరే

    పివాల్యూ అనలిటిక్స్ సమాచారం ప్రకారం, ప్రస్తుతం జన్ సురాజ్ పార్టీ మూడు కీలక స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

    చన్‌పటియా: త్రిపురారి కుమార్ తివారీ అలియాస్ మనీష్ కశ్యప్

    చైన్‌పూర్: హేమంత్ కుమార్ చౌబే

    కర్గాహర్: రితేష్ రంజన్

  • Nov 14, 2025 09:05 am IST

    బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: ఎన్డీయే 96, ఎంజీబీ 65

    బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 96 సీట్లలో ముందంజలో ఉండగా, ఎంజీబీ 65 సీట్లలో ముందంజలో ఉంది.

  • Nov 14, 2025 08:56 am IST

    46 సీట్లలో ఆర్జేడీ ముందంజ

    ఎంజీబీ కూటమిలో ప్రధాన పార్టీ రాష్ట్రీష జనతాదళ్ (ఆర్జేడీ) ఇప్పటివరకు 46 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కేవలం 7 సీట్లలో ముందంజలో ఉంది. మొత్తంగా మహా కూటమి కేవలం 60 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

  • Nov 14, 2025 08:55 am IST

    బీహార్ ఎన్నికల ఫలితాలు 2025 లైవ్: బీజేపీ దూకుడు

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూకుడుగా వెళుతోంది. బీజేపీ ఇప్పటి వరకు 49 సీట్లలో ముందంజలో ఉంది. జేడీయూ 35 సీట్లలో ముందంజలో ఉంది. మొత్తంగా ఎన్డీయే కూటమి 87 సీట్లలో ముందంజలో ఉంది.

  • Nov 14, 2025 08:46 am IST

    విజయం దిశగా ఎన్డీయే దూకుడు

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఎన్డీయే 79 సీట్లలో, ఎంజీబీ 57 సీట్లలో ముందంజలో ఉన్నాయి. విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతున్నట్టు స్పష్టమవుతోంది.

  • Nov 14, 2025 08:35 am IST

    బీహార్ ఎన్నికల ఫలితాలు 2025: ఎన్డీయే 65 సీట్లలో ముందంజ

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 65 సీట్లలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉండగా, ఎంజీబీ 45 సీట్లలో ముందంజలో ఉంది. ఇతరులు 5 సీట్లలో ముందంజలో ఉన్నారు.

  • Nov 14, 2025 08:29 am IST

    బీహార్ ఎన్నికల ఫలితాలు 2025: ఎన్డీయే 66 సీట్లలో ముందంజ

    బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 66 సీట్లలో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహాగట్‌బంధన్ 40 సీట్లలో, జన్ సురాజ్ పార్టీ 2 సీట్లలో ముందంజలో కొనసాగుతున్నాయి.

  • Nov 14, 2025 08:17 am IST

    బీహార్ ఎన్నికల ఫలితాలు 2025: ఎన్డీయే 29 సీట్లలో ముందంజ

    బీహార్ అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో 29 సీట్లలో ఎన్డీయే కూటమి, 19 సీట్లో ఎంజీబీ, జన్ సురాజ్ 1 సీటులో ముందంజలో ఉన్నాయి.

  • Nov 14, 2025 08:03 am IST

    ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి: మెజారిటీ ఎన్డీఏకేనా?

    చాలా ఎగ్జిట్ పోల్స్ జేడీ(యూ)-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు విజయాన్ని అంచనా వేశాయి. మెజారిటీ మార్కు 122 కాగా, ఎన్డీఏకు 121 నుంచి 209 సీట్ల వరకు రావొచ్చని కొన్ని అంచనా వేశాయి. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కనీస సీట్ల సంఖ్యను సైతం మెజారిటీ మార్కు కంటే ఎక్కువగానే చూపాయి.

  • Nov 14, 2025 08:02 am IST

    బిహార్ ఎన్నికల ఫలితాలు: కౌంటింగ్ ప్రారంభం

    ఈరోజు (నవంబర్ 14) ఉదయం 8 గంటలకు బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 243 సీట్లలో అధికారం దక్కించుకోవాలంటే 122 సీట్ల మెజారిటీ అవసరం.

  • Nov 14, 2025 08:01 am IST

    సీఎం అభ్యర్థి ప్రాధాన్యత: ఒక ట్విస్ట్

    ఎగ్జిట్ పోల్స్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయాన్ని అంచనా వేసినప్పటికీ, రెండు ప్రధాన పోల్ సంస్థలు (యాక్సిస్ మై ఇండియా, పీపుల్స్ పల్స్) ఆర్జేడీ నేత తేజస్వి యాదవే "ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టపడే అభ్యర్థి" అని చూపించాయి. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం, నితీశ్ కుమార్‌కు 22% ఆమోదం లభిస్తే, తేజస్వికి 34% ఆమోదం ఉంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం.

  • Nov 14, 2025 07:44 am IST

    2020లో జేడీయూకు ఎన్ని సీట్లు దక్కాయి?

    2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేసి 43 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి 15.39 శాతం ఓట్లు దక్కాయి.

  • Nov 14, 2025 07:43 am IST

    2020లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

    2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 సీట్లు గెలుచుకుంది. 9.48 శాతం ఓట్లు దక్కించుకోగలిగింది.

  • Nov 14, 2025 07:21 am IST

    2020లో చిన్న పార్టీల అద్భుత విజయాలు

    ఒక నిర్దిష్ట సిద్ధాంతం లేదా ప్రాంతీయ బలం ఉన్న కొన్ని చిన్న, గుర్తింపు లేని పార్టీలు కూడా వ్యూహాత్మకంగా పోటీ చేసి అద్భుతమైన విజయాలు సాధించగలవని స్పష్టమవుతోంది. 2020లో చిన్న పార్టీల విజయాలు ఇవీ..

    • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) [CPI(ML)(L)]: 12 సీట్లు

    • హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) [HAMS]: 4 సీట్లు

    • వికాశీల్ ఇన్సాన్ పార్టీ [VSIP]: 4 సీట్లు

  • Nov 14, 2025 07:19 am IST

    2020లో స్వతంత్రులకు నిరాశ

    భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల బరిలోకి దిగడం సులభమే కానీ గెలవడం ఎంత కష్టమో ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2020 ఎన్నికల్లో స్వతంత్రులుగా (Independents) 1299 మంది, గుర్తింపు లేని పార్టీల (Registered Unrecognised Parties) తరపున 1510 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

    1299 మంది స్వతంత్ర అభ్యర్థులలో, కేవలం ఒక్కరు మాత్రమే గెలుపొందారు. ఇది స్వతంత్ర అభ్యర్థులకు విజయం దాదాపు అసాధ్యమని చూపిస్తోంది.

  • Nov 14, 2025 07:18 am IST

    2020లో "స్పాయిలర్" పార్టీల ప్రభావం

    కొన్ని పార్టీలు ఎక్కువ సీట్లు గెలవకపోయినా, ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వీటిని "స్పాయిలర్" పార్టీలు అని అంటారు. వీరు ఇతర పార్టీల గెలుపోటములను శాసిస్తారు.

    బీహార్ 2020 ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (LJP) దీనికి సరైన ఉదాహరణ. ఈ పార్టీ 135 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి 5.66% ఓట్లు వచ్చాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. ఈ ఓట్లు LJPకి సీట్లుగా మారకపోయినా, అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చాయి. దీనివల్ల ఆయా అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయి ఉండవచ్చు. ఇలా, LJP గెలవకపోయినా, ఎవరు గెలవకూడదో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించింది.

  • Nov 14, 2025 07:16 am IST

    2020లో నోటాకు భారీ ఓట్లు

    "NOTA" అంటే "నన్ ఆఫ్ ది అబవ్" (పైవారెవరూ కాదు). బరిలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని ఓటర్లు ఈ ఎంపికను ఎంచుకుంటారు. 2020 బీహార్ ఎన్నికల్లో నోటా ఒక నిశ్శబ్ద నిరసనగా గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

    మొత్తంగా 7,06,295 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇది మొత్తం ఓట్ల వాటాలో 1.68%. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఓట్ల శాతం, సీట్లు గెలుచుకున్న అనేక పార్టీల వ్యక్తిగత ఓట్ల శాతం కంటే ఎక్కువ. ఉదాహరణకు:

    • బహుజన్ సమాజ్ పార్టీ (BSP): 1.49%

    • ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM): 1.24%

    • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI): 0.83%

    • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPIM): 0.65%

    అంటే, సీట్లు గెలుచుకున్న ఈ పార్టీల కంటే ఎక్కువ మంది ప్రజలు బరిలో ఉన్న అభ్యర్థులందరినీ తిరస్కరించారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఓటర్లలో ఉన్న అసంతృప్తికి ఒక కొలమానం.

  • Nov 14, 2025 07:15 am IST

    202లో 135 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలుపు

    గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (LJP) 135 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలవగలిగింది. ఇది తక్కువ స్ట్రైక్ రేట్‌కు ఉదాహరణ.

  • Nov 14, 2025 07:14 am IST

    గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) (ఎల్) స్ట్రైక్ రేట్

    గత ఎన్నికల్లో CPI(ML)(L) పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి, వాటిలో 12 స్థానాలను గెలుచుకుంది. ఇది అసాధారణమైన సామర్థ్యానికి నిదర్శనం. వారు పోటీ చేసిన చోట్ల వారి ఓట్ల శాతం 41.36%.

  • Nov 14, 2025 06:53 am IST

    గత ఎన్నికల్లో బీజేపీ స్ట్రైక్ రేట్ 67 శాతం

    BJP 202 అసెంబ్లీ ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసి 74 గెలిచింది, అంటే వారి స్ట్రైక్ రేట్ 67% (74/110)గా నమోదైంది. వారు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారికి 42.56% ఓట్లు వచ్చాయి, ఇది వారి బలమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది.

  • Nov 14, 2025 06:48 am IST

    2020లో ఎంఐఎం ఎన్ని స్థానాలు గెలుచుకుంది?

    ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో (2020లో) 20 స్థానాల్లో పోటీ చేసి, 5 స్థానాలను గెలుచుకుంది. దీని ఓట్ల శాతం 1.24%

  • Nov 14, 2025 06:48 am IST

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: 2020లో ఏం జరిగింది?

    2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో RJD (75 స్థానాలు) అత్యధికంగా గెలుచుకున్న పార్టీగా నిలిచింది, దాని తర్వాత BJP (74 స్థానాలు) నిలిచింది. JD(U) (43 స్థానాలు) మూడవ స్థానంలో ఉంది.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) (CPI(ML)(L)) పార్టీ 19 స్థానాల్లో పోటీ చేసి, 12 స్థానాలను గెలుచుకుంది. దీని ఓట్ల శాతం 3.16%

  • Nov 14, 2025 06:11 am IST

    ఉప ఎన్నికల ఫలితాలు నేడే

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం సహా వివిధ రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలకు నేడు ఫలితం వెలువడనుంది.

  • Nov 14, 2025 06:00 am IST

    బీహార్ కౌంటింగ్ లైవ్ అప్డేట్స్: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్పాయి?

    బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లలో 122 సీట్ల మెజారిటీ కోసం ఎన్డిఎ, మహాకూటమి పోటీ పడ్డాయి. పోలింగ్ కూడా భారీగా నమోదైంది. అయితే బీహార్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ తామే గెలుస్తామని మహా కూటమి గట్టిగా విశ్వసిస్తోంది.

  • Nov 14, 2025 05:58 am IST

    బీహార్ అసెంబ్లీ ఫలితాలు 2025: ఏ కూటమిలో ఏయే పార్టీలు?

    బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేలో బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ, దీపంకర్ భట్టాచార్య నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (సీపీఐ-ఎంఎల్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం), ముఖేష్ సహానీ నేతృత్వంలోని వికాస్ హీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ఉన్నాయి.

  • Nov 14, 2025 05:55 am IST

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కౌంటింగ్ ఎన్ని గంటలకు?

    బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎర్లీ ట్రెండ్స్ ఉదయం 8.30 గంటల నుండి రావడం ప్రారంభమవుతుంది. 11 గంటల కల్లా విజేతలు ఎవరో స్పష్టత వస్తుంది.

  • Nov 14, 2025 05:48 am IST

    తేలనున్న 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం

    బీహార్ ఫలితాలు 2025: బీహార్‌లో రికార్డు స్థాయిలో 67.13% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో 243 నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.

SHARE THIS ARTICLE ON
 
Subscribe Now!