...
...
Next Story

రైలు ప్రయాణికులకు షాక్: పెరిగిన టికెట్ ధరలు.. శుక్రవారం నుంచే కొత్త ఛార్జీల అమలు

రైలు ప్రయాణికులపై రైల్వే శాఖ అదనపు భారం మోపింది. కిలోమీటరుకు 1 నుంచి 2 పైసల వరకు ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 26, శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Published on: Dec 25, 2025 09:56 PM IST
Advertisement

సామాన్య రైలు ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. దేశవ్యాప్తంగా రైలు టికెట్ ధరలను పెంచుతూ రైల్వే శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు ఈ శుక్రవారం (డిసెంబర్ 26) నుంచే అమలు కానున్నాయి. ఏడాది కాలంలో రైల్వే చార్జీలను సవరించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత జూలైలో కూడా ఒకసారి ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

రైలు ప్రయాణికులకు షాక్: పెరిగిన టికెట్ ధరలు.. శుక్రవారం నుంచే కొత్త ఛార్జీల అమలు (PTI)
రైలు ప్రయాణికులకు షాక్: పెరిగిన టికెట్ ధరలు.. శుక్రవారం నుంచే కొత్త ఛార్జీల అమలు (PTI)

రైల్వే కార్యకలాపాల నిర్వహణలో స్థిరత్వం, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన మధ్య సమతుల్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఎవరిపై ఎంత భారం?

కొత్త ధరల ప్రకారం.. ప్రయాణించే దూరం, కోచ్ కేటగిరీని బట్టి చార్జీల పెంపు ఉంటుంది.

ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే సాధారణ తరగతి ప్రయాణికులకు కిలోమీటరుకు 1 పైసా పెరగనుంది.

మెయిల్/ఎక్స్‌ప్రెస్ & ఏసీ క్లాస్‌లు: నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు, అన్ని రకాల ఏసీ క్లాస్‌లకు (స్లీపర్, ఏసీ 3-టియర్, 2-టియర్, ఫస్ట్ క్లాస్) కిలోమీటరుకు 2 పైసలు అదనంగా వసూలు చేస్తారు.

వీరికి ఊరట..

మధ్యతరగతి, రోజువారీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ కొన్ని మినహాయింపులు ఇచ్చింది:

సబర్బన్ సర్వీసులు: లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి ధరల పెంపు వర్తించదు.

సీజన్ టికెట్లు: మంత్లీ పాస్ (సీజన్ టికెట్) తీసుకునే వారికి పాత ధరలే కొనసాగుతాయి.

స్వల్ప దూరం: 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే సాధారణ తరగతి (Ordinary Non-AC) ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం ఉండదు.

దూరాన్ని బట్టి అదనపు బాదుడు

కేవలం సాధారణ రైళ్లే కాకుండా ప్రీమియం సర్వీసులైన వందే భారత్, రాజధాని, శతాబ్ది, దురంతో, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్, గతిమాన్, గరీబ్ రథ్, జన్ శతాబ్ది వంటి రైళ్లలో కూడా క్లాస్ వారీగా ధరలను సవరించారు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం

ఈ పెరిగిన ధరలు కేవలం డిసెంబర్ 26వ తేదీన లేదా ఆ తర్వాత బుక్ చేసుకునే టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. మీరు ఒకవేళ ఈ తేదీకి ముందే టికెట్ బుక్ చేసుకుని ఉండి, మీ ప్రయాణం శుక్రవారం తర్వాత ఉన్నప్పటికీ.. మీరు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

"ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే వ్యవస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని ఈ సమతుల్య నిర్ణయం తీసుకున్నాం. సురక్షితమైన, సరసమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం" అని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe