...
...
Next Story

ఆన్‌లైన్ మోసాలకు చెక్: రూ. 10 వేలు దాటితే యూపీఐ పేమెంట్లకు గంట బ్రేక్!

యూపీఐ, ఆన్‌లైన్ చెల్లింపుల మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ సంచలన ప్రతిపాదనలు చేసింది. రూ. 10,000 దాటిన లావాదేవీలకు గంట పాటు బ్రేక్ వేయడంతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం 'ట్రస్టెడ్ పర్సన్', స్కామ్‌ల నివారణకు 'కిల్ స్విచ్' తీసుకురానుంది.

Published on: Apr 13, 2026 01:33 PM IST
Advertisement

డిజిటల్ చెల్లింపులు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. క్షణాల్లో డబ్బులు బదిలీ చేసే ఈ సౌలభ్యం సామాన్యులకు ఎంత మేలు చేస్తోందో, సైబర్ మోసగాళ్లకు కూడా అంతే వరంగా మారుతోంది. నమ్మకంగా మాట్లాడి, ఏవో ఆశలు చూపి మన ఖాతాల్లోని కష్టార్జితాన్ని క్షణాల్లో కొల్లగొడుతున్నారు. ఈ తరహా మోసాలకు (ఆథరైజ్డ్ పుష్ పేమెంట్ స్కామ్స్) శాశ్వత పరిష్కారం చూపే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంచలన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆన్‌లైన్ మోసాలను ఎలా అరికట్టాలనే అంశంపై 'డిజిటల్ చెల్లింపుల్లో భద్రతా చర్యలు' పేరిట ఒక ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది.

రూ. 10 వేలు దాటితే గంట పాటు బ్రేక్

ఆన్‌లైన్ మోసాలకు చెక్: రూ. 10 వేలు దాటితే యూపీఐ పేమెంట్లకు గంట బ్రేక్! (Bloomberg)
ఆన్‌లైన్ మోసాలకు చెక్: రూ. 10 వేలు దాటితే యూపీఐ పేమెంట్లకు గంట బ్రేక్! (Bloomberg)

ఆన్‌లైన్ మోసాలను అడ్డుకోవడంలో భాగంగా, రూ. 10,000 పైబడిన వ్యక్తిగత (పీ2పీ) లావాదేవీలకు ఒక గంట పాటు సమయం (డీలే) విధించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. యూపీఐతో పాటు ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS), నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్లకు ఇది వర్తిస్తుంది.

ఈ విధానంలో మీరు ఎవరికైనా రూ. 10 వేలకు మించి డబ్బు పంపగానే, మీ ఖాతాలో ఆ మొత్తం కట్ అవుతుంది. కానీ, ఆ డబ్బు అవతలి వ్యక్తికి చేరడానికి గంట సమయం పడుతుంది. ఈ లోపు ఆ లావాదేవీ మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకులకు కూడా ఏదైనా మోసం జరుగుతోందని అనుమానం వస్తే, లావాదేవీని ఆపివేసి ఖాతాదారుడిని అప్రమత్తం చేస్తాయి. ఆ తర్వాత కూడా మీరు ఓకే చెబితేనే ఆ డబ్బు బదిలీ అవుతుంది. అయితే, మనకు తెలిసిన వారికి, రెగ్యులర్‌గా డబ్బులు పంపే ఖాతాలను 'వైట్‌లిస్ట్'లో చేర్చుకుంటే ఈ నిబంధన వర్తించదు.

సీనియర్ సిటిజన్ల కోసం 'ట్రస్టెడ్ పర్సన్'

వృద్ధులు, దివ్యాంగులను సైబర్ నేరగాళ్లు సులభంగా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ 'ట్రస్టెడ్ పర్సన్' (నమ్మకస్తుడైన వ్యక్తి) విధానాన్ని తెరపైకి తెచ్చింది. సీనియర్ సిటిజన్లు రూ. 50,000 పైబడి ఆన్‌లైన్ ద్వారా ఎవరికైనా డబ్బు పంపాలంటే, వారు ముందుగా నియమించుకున్న ఈ 'ట్రస్టెడ్ పర్సన్' ఆమోదం కూడా తప్పనిసరి. ఆ వ్యక్తి ఓకే చెబితేనే డబ్బు బదిలీ అవుతుంది. ఈ నమ్మకస్తుడిని మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, భద్రత దృష్ట్యా ఆ మార్పు అమలు కావడానికి 24 గంటల సమయం తీసుకుంటుంది.

క్షణాల్లో ఖాతాను లాక్ చేసే 'కిల్ స్విచ్'

ఈ కొత్త భద్రతా చర్యలు కేవలం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకే (P2P) వర్తిస్తాయి. కిరాణా షాపులు, మాల్స్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి మర్చంట్ చెల్లింపులు, ఈఎంఐల వంటి రికరింగ్ పేమెంట్లు, చెక్కు లావాదేవీలకు ఈ ఆంక్షల నుంచి ఆర్‌బీఐ మినహాయింపు ఇచ్చింది.

"ఆన్‌లైన్ డిజిటల్ మోసాల బారి నుంచి సామాన్యులను రక్షించేందుకు ఆర్‌బీఐ తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో కీలకం కానున్నాయి," అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం ముసాయిదా దశలో ఉన్న ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe