...
...
Next Story

Reliance Jio IPO ఎప్పుడు? గ్రే మార్కెట్​ ప్రీమియం, ప్రైజ్​ బ్యాండ్​ వివరాలు..

భారత స్టాక్​ మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయి ఐపీఓకు రిలయన్స్ జియో సిద్ధమవుతోందని సమాచారం. 2026 ప్రథమార్థంలో రానున్న ఈ పబ్లిక్ ఇష్యూ విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33 వేల కోట్లు) ఉండవచ్చని అంచనా.

Published on: Jan 10, 2026, 12:20:36 IST
Advertisement

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది! టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన 'రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్' ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించిన వివరాల ప్రకారం, 2026 జూన్ నాటికి జియో షేర్లు స్టాక్ మార్కెట్​లో లిస్ట్ కానున్నాయి.

రిలయన్స్​ జియో ఐపీఓ వివరాలు..
రిలయన్స్​ జియో ఐపీఓ వివరాలు..

ఈ ఐపీఓ ద్వారా రిలయన్స్ గ్రూప్ సుమారు 2.50 శాతం వాటాను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీని విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 33,000 కోట్లకు పైగా) ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఒకవేళ ఇదే జరిగితే, 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (3.3 బిలియన్ డాలర్లు) ఐపీఓ రికార్డును జియో చెరిపివేయనుంది!

రిలయన్స్​ జియో విలువ ఎంత? షేర్ ధర ఎంత ఉండవచ్చు?

ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల అంచనా ప్రకారం.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్ మొత్తం విలువ 130 బిలియన్ డాలర్ల నుంచి 170 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14 లక్షల కోట్లు) మధ్య ఉండవచ్చు. జెఫరీస్ వంటి సంస్థలైతే ఈ వాల్యుయేషన్​ని 180 బిలియన్ డాలర్లుగా కూడా అంచనా వేస్తున్నాయి.

ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షేర్ ధర గురించి బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ మాట్లాడుతూ.. "కంపెనీ విలువ, రిటైల్ ఇన్వెస్టర్లకు ఇచ్చే డిస్కౌంట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఒక్కో షేర్ ధర రూ. 1,048 నుంచి రూ. 1,457 మధ్య ఉండే అవకాశం ఉంది," అని అంచనా వేశారు.

రిలయన్స్​ జియో ఐపీఓ జీఎంపీ ఎంత ఉంది?

వాస్తవానికి జియోను ఐదేళ్లలోనే లిస్ట్ చేస్తానని అంబానీ 2019లో ప్రకటించారు. కానీ, డిజిటల్ బిజినెస్‌లో మరిన్ని వినూత్న మార్పులు తెచ్చి, కంపెనీ వాల్యుయేషన్​ని మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈ ఐపీఓను 2026 వరకు పొడిగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం జియో కేవలం టెలికాంకే పరిమితం కాకుండా, ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలోనూ దూసుకుపోతోంది.

మరోవైపు, త్వరలోనే భారత్‌లోకి అడుగుపెట్టనున్న ఎలోన్ మస్క్ కు చెందిన 'స్టార్‌లింక్' ఇంటర్నెట్ సర్వీసులతోనూ జియో తలపడనుంది.

రిలయన్స్​ జియో ఐపీఓ పేపర్లు ఇంకా సెబీ వరకు వెళ్లలేదు. ఈ భారీ ఐపీఓకు సంబంధించి డాక్యుమెంట్లు సిద్ధం చేసే పనిలో మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్రా బ్యాంకర్లు నిమగ్నమైనట్లు సమాచారం. సెబీ చేతికి డీఆర్​హెచ్​పీ పేపర్లు అందిన తర్వాత ఈ ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

రికార్డుల దిశగా భారత మార్కెట్..

2025లో ప్రపంచంలోనే అత్యధిక ఐపీఓలు వచ్చిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్ నాటికే సుమారు 21.6 బిలియన్ డాలర్ల నిధులను కంపెనీలు సేకరించాయి. ఇప్పుడు జియో ఎంట్రీతో భారత మార్కెట్ మరింత కళకళలాడనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks