...
...
Next Story

Ram Temple Donation Scam : ‘వెంటనే ఆ వివరాలు బయటపెట్టండి’- అయోధ్య విరాళాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Ayodhya Ram Temple Donation Scam : అయోధ్య రాముడి ఆలయ విరాళాల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదిక పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.

Published on: Jul 13, 2026 01:19 PM IST
Advertisement

హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వస్తున్న విరాళాల అవకతవకల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధులు పక్కదారి పట్టాయంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అక్రమాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుపుతూ తక్షణమే తాజా నివేదికను సమర్పించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సిట్‌లో ఉన్న అధికారులు ఎవరు?

అయోధ్య విరాళాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. (PTI)
అయోధ్య విరాళాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. (PTI)

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయని, దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న 'సిట్' బృందంలో ఏయే అధికారులు ఉన్నారో, వారి పేర్లతో కూడిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

"ఈ అయోధ్య రామాలయ విరాళల వివాదం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ సభ్యులు ఎవరో మాకు తెలియాలి. వారు ఇప్పటివరకు సేకరించిన వివరాలతో నివేదిక ఫైల్ చేయండి. ఆ నివేదికను చూసిన తర్వాతే ఈ కేసులో సీబీఐ లేదా ఇతర సంస్థలతో విచారణ అవసరమా కాదా అనే దానిపై మేము అదనపు ఆదేశాలు ఇస్తాము," అని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ వివాదంపై తమ వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై యూపీ పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సిట్ విచారణ ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని కోర్టుకు వివరించారు.

సీఏజీ ఆడిట్, సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన మూడో పిటిషన్ ఈ కేసులో అత్యంత కీలకమైన అంశాలను లేవనెత్తింది. కోర్టు పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తుతో పాటు ట్రస్ట్ నిధులపై సమగ్ర 'ఫోరెన్సిక్ ఆడిట్' జరపాలని ఆయన కోరారు. భక్తులు పంపిన యూపీఐ లావాదేవీల రికార్డులు, డిజిటల్ లెెడ్జర్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, భౌతిక పత్రాలను ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా భద్రపరిచేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

అంతేకాకుండా, విచారణ పూర్తయ్యేంతవరకు సదరు ట్రస్ట్ ఎలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇవ్వకుండా, నిధుల వినియోగంపై నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోవాలని, ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నగదు రూపంలో, బ్యాంకు బదిలీలు, విదేశీ విరాళాలు, బంగారం, వెండి రూపంలో వచ్చిన ప్రతీ కానుక పూర్తి వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. పారదర్శకత కోసం దాతల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూనే, ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచేలా నిబంధనలు పెట్టాలని కోరారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe