...
...
Next Story

Trump Iran war : ఆ ఒక్క ఫోన్​ కాల్​.. ఖమేనీని అంతం చేసింది! ఇరాన్​పై దాడుల వెనుక షాకింగ్​ నిజాలు..

Iran Israel war : పశ్చిమాసియాలో ప్రస్తుతం చెలరేగుతున్న యుద్ధ జ్వాలలకు, ఇరాన్ అగ్రనేత అల్​ ఖమేనీ హతమవ్వడానికి.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఒక రహస్య ఫోన్ కాలే కారణమని ఒక సంచలనాత్మక నివేదిక బయటకు వచ్చింది.

Published on: Mar 4, 2026, 14:00:12 IST
Advertisement

గత సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అందించిన ఒక అత్యంత రహస్య సమాచారం (టిప్​) ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీ, ఆయన అత్యున్నత స్థాయి అధికారులు శనివారం ఉదయం ఒకే చోట సమావేశం కాబోతున్నారనే సమాచారాన్ని ట్రంప్​నకు నెతన్యాహు అందించారు. ఈ మేరకు ఇరాన్​పై దాడి గురించి తెర వెనుక విషయాన్ని వివరిస్తూ 'యాక్సియోస్' అనే వార్తాసంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

ట్రంప్​- నెతన్యాహు.. (REUTERS)
ట్రంప్​- నెతన్యాహు.. (REUTERS)

ఆ ఫోన్ కాల్ వివరాల గురించి తెలిసిన ముగ్గురు వ్యక్తుల సమాచారం ప్రకారం.. ఆ సమావేశం జరుగుతున్న చోట ఒకే ఒక్క వైమానిక దాడి జరిపితే, అందరినీ ఒకేసారి హతం చేయవచ్చని నెతన్యాహు ట్రంప్‌నకు వివరించారు. ఇరాన్‌పై యుద్ధం మొదలవ్వడానికి, అది గల్ఫ్ దేశాలకు వ్యాపించడానికి ఇదే కీలక మలుపు అని సదరు నివేదిక పేర్కొంది.

ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరికీ ఖమేనీ, ఆయన సహచరులు చాలా కాలంగా ప్రధాన టార్గెట్​లుగా ఉన్నారు. అందుకే ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోవడానికి ఇరు దేశాలు సిద్ధపడలేదు. దాని ఫలితమే గత శనివారం ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్​ దాడులు.

ముందే దాడి చేయాలనుకున్న ట్రంప్!

నిజానికి ఖమేనీ గురించిన ఈ కొత్త నిఘా సమాచారం అందకముందే ట్రంప్ ఇరాన్‌పై దాడి చేయాలని భావించినట్లు యాక్సియోస్ నివేదిక పేర్కొంది. అయితే 'ఎప్పుడు' దాడి చేయాలనే విషయంలో నెతన్యాహు ఫోన్ కాల్‌తో స్పష్టత వచ్చింది.

ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఫోన్ కాల్, గత రెండు నెలలుగా ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న నిరంతర సమన్వయంలో భాగమే. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. గత రెండు నెలల్లో ట్రంప్, నెతన్యాహు 15 సార్లు ఫోన్​లో మాట్లాడుకోగా, రెండుసార్లు నేరుగా భేటీ అయ్యారు.

నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ అందిన వెంటనే, ట్రంప్ ఆ నిఘా సమాచారం ఎంతవరకు నిజమో తేల్చాలని సీఐఏని ఆదేశించారు. సమాచారం పక్కా అని తేలడంతో యుద్ధ సన్నాహాలు వేగవంతం చేశారు. ఇరాన్ నేతలకు ఎలాంటి అనుమానం రాకూడదని తన 'స్టేట్ ఆఫ్ యూనియన్' ప్రసంగంలో కూడా ట్రంప్ ఇరాన్ ప్రస్తావనను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు.

ఖమేనీ, ఆయన బృందం అంతా ఒకే చోట చేరుతున్నారనే విషయాన్ని సీఐఏ గురువారం నాటికి ధృవీకరించింది. అదే రోజు ట్రంప్ ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ కూడా ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు విఫలమవుతున్నాయని ట్రంప్‌నకు వివరించారు.

"మనం దౌత్యం కోసం పోరాడదాం.. కానీ వీరు (ఇరాన్ నేతలు) మీకు నచ్చే ఒప్పందానికి ఏమాత్రం సిద్ధంగా లేరు," అని ట్రంప్‌నకు నివేదించారు.

దీనితో రెండు విషయాలపై అమెరికా అధ్యక్షుడికి క్లారిటీ వచ్చింది: ఒకటి పక్కా నిఘా సమాచారం ఉంది, రెండు ఇరాన్ దౌత్యానికి లొంగడం లేదు.

విధ్వంసం.. ఆపై యుద్ధం

ట్రంప్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన 11 గంటల తర్వాత, ఇరాన్ రాజధాని టెహ్రాన్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ పలు ఇరాన్ నగరాల్లోని సైనిక కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా సమన్వయంతో వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్ అల్​ ఖమేనీతో పాటు మరో నలుగురు ఉన్నత స్థాయి భద్రతా అధికారులు మరణించారు.

ఈ ఘటన తర్వాత యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ ఇప్పుడు ఖతార్, సౌదీ అరేబియాలోని ప్రధాన అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను సైతం మూసివేసింది. ఇది అంతర్జాతీయ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks