అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ తగిలింది.అంతర్జాతీయ సుంకాలపై ఇచ్చిన ఆదేశాలను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జాతీయ అత్యవసర పరిస్థితులలో ఉపయోగించడానికి ఉద్దేశించిన చట్టాలపై దాఖలైన పిటిషన్లపై విచారిస్తూ కీలక తీర్పును వెలువరించింది.

పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు… చట్టవిరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టివేసింది.
రిపబ్లికన్ అధ్యక్షుడి తీరు 1977 చట్ట (ఐఈఈపీఏ- ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్) అధికార పరిధిని మించిపోయిందని పేర్కొంది. విస్తృత వాణిజ్య చర్యలను సమర్థించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ట్రంప్ చాలా దేశాలపై సుంకాలను విధించడం ద్వారా తన అధికార పరిధిని అధిగమించారని నొక్కి చెప్పింది.
ట్రంప్ సుంకాలపై అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘమైన విచారణ చేపట్టింది. ధర్మాసనంలోని ఆరుగురు జడ్జిలు ఈ సుంకాలను వ్యతిరేకించగా… ముగ్గురు న్యాయమూర్తులు మాత్రం సముర్థించారు.
అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన ఈ చట్టాన్ని ఉపయోగించి ట్రంప్… ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై టారిఫ్ లు విధించారు. 6 - 3 మెజారిటీతో సుప్రీం కోర్టు ఈ టారిఫ్ లను రద్దు చేసింది.
ట్రంప్ సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో…. అక్కడి స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. తీర్పు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే సూచీలు లాభాల దిశగా వెళ్లాయి.