ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తాజాగా పేర్కొంది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం…తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
- మార్చి 25 : రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయి. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (30-40 కి.మీ వేగం) కూడిన వర్షాలు పడొచ్చు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి మరియు నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- మార్చి 26: ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి మరియు మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
- మార్చి 27 : అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు వీస్తాయి.
- మార్చి 28 : అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- మార్చి 29 నుంచి 30 వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (30-40 కి.మీ/గం) వీచే అవకాశం ఉంది.
నగరంలో అకాల వర్షం..
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం పడడంతో పలు చోట్ల చెట్లు పడిపోయాయి. కొమ్మలు విరిగి కరెంటు తీగలమీద పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే రహదారుల్లో వర్షపు నీరు నిలిచింది. సరిగ్గా సాయంత్రం కార్యాలయాలు వదిలిన సమయంలో వర్షం పడడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
పలు చొట్ల చెట్టు, కొమ్మలు రోడ్డుమీద పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రహదారుల్లో నిలిచిన నీటిని తొలగించాయి. అలాగే చెట్ల కొమ్మలను తొలగించాయి. రహదారులకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించాయి. 21 చోట్ల చెట్లు పడిపోగా.. 11చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయిందనే ఫిర్యాదులందాయి. గచ్చిబౌలి డీఎల్ ఎఫ్ రోడ్డులో రహదారి మధ్యన డివైడర్ మీద ఉన్న కరెంటు స్తంభం చెట్లపై పడిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. షేక్‌పేట పరిసరాల్లో రోడ్డుమీద నిలిచిపోయిన నీటిని తొలగించారు. కల్యాణ్‌నగర్ ఫేజ్ -1 లో కరెంటు లైన్లపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైడ్రా సిబ్బంది వాటిని క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట, మియాపూర్, గోల్కండ, మాధాపూర్, గుడిమల్కాపూర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో చెట్లు పడిపోగా హైడ్రా సిబ్బంది బ్యాటరీ కట్టర్లతో వాటిని తొలగించారు. దాదాపు 2 సెంటీమీటర్ల వర్షం ఈదురుగాలులతో కురవడంతో నగరంలో ఇబ్బందులు తలెత్తాయి. హైడ్రాకు అందిన ఫిర్యాదులన్నీ అటెండయి 90 శాతం 9 గంటల ప్రాంతంలో క్లియర్ చేశారు.