తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాల్లో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
గమ్యస్థానం మార్పు….

సాధారణంగా చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు రాకపోకలు సాగిస్తుంటుంది. అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో ప్రస్తుతం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రైలును తాంబరం స్టేషన్ వరకు కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల మీదుగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 12760) ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకg చెన్నై బీచ్ వరకూ మాత్రమే గమ్యస్థానం ఉంటుంది. ఈ ట్రైన్ చెన్నై బీచ్ కు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.
మరోవైపు తాంబరం స్టేషన్ కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12759) ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 5 వరకు సాయంత్రం 6.20కు బయలుదేరుతుంది. ఈ మార్పును ప్రయాణికులు గమనించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.