...
...
Next Story

గ్రామీణ భారతంలో రోబోటిక్ గుండె సర్జరీల విప్లవం.. ఢిల్లీ నుంచి ఆపరేషన్.. కర్ణాటకలో రోగికి చికిత్స

ఖరీదైన రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలను కేవలం ఐదో వంతు ఖర్చుతోనే సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావచ్చని వైద్య నిపుణులు వెల్లడించారు. కర్ణాటకలోని సాయి గ్రామంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సరికొత్త స్వదేశీ రోబోటిక్ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించారు.

Published on: Jul 14, 2026 09:22 AM IST
Advertisement

కార్డియాక్ సర్జరీ రంగంలో సరికొత్త మైలురాయికి కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా సత్యసాయి గ్రామం వేదికగా నిలిచింది. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' ఆధ్వర్యంలో నడుస్తున్న దేశంలోనే మొట్టమొదటి ఉచిత ప్రైవేట్ గ్రామీణ వైద్య కళాశాల 'శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్' (SMSIMSR) రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్, రోబోటిక్ కార్డియాక్ సర్జరీ సదస్సును (IERCSC 2026) విజయవంతంగా నిర్వహించింది. తక్కువ కోతతో చేసే గుండె ఆపరేషన్లు, రోబోటిక్ సర్జరీలలో వస్తున్న సరికొత్త ఆవిష్కరణలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది.

ప్రపంచస్థాయి నిపుణుల కలయిక

గ్రామీణ భారతంలో రోబోటిక్ గుండె సర్జరీల విప్లవం.. అంతర్జాతీయ సదస్సు
గ్రామీణ భారతంలో రోబోటిక్ గుండె సర్జరీల విప్లవం.. అంతర్జాతీయ సదస్సు

మణిపాల్ హాస్పిటల్స్, ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఎస్‌ఎమ్‌ఎస్‌ఎమ్‌ఎస్‌ఆర్ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, గ్రీస్, జర్మనీ, బ్రెజిల్, చైనా, వియత్నాం, మలేషియా, ఉక్రెయిన్ వంటి పలు దేశాలకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు, పరిశోధకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అత్యాధునిక శస్త్రచికిత్స పద్ధతులను పంచుకోవడానికి, అంతర్జాతీయ పరిశోధనలను బలోపేతం చేయడానికి ఈ వేదిక ఉపయోగపడింది.

ఢిల్లీ నుంచి ఆపరేషన్

ఈ సదస్సులో లైవ్ రిమోట్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ ఢిల్లీలో ఉంటూ, సాయి గ్రామంలోని ఆసుపత్రిలో ఉన్న రోగికి స్వదేశీ సాంకేతికతతో తయారైన 'ఎస్ఎస్ఐ మంత్ర' (SSI Mantra) రోబోటిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా క్లిష్టమైన గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కోయంబత్తూర్, గ్రీస్ దేశాల నుంచి కూడా లైవ్ సర్జరీలను ప్రత్యక్ష ప్రసారం చేసి, అక్కడి వైద్య బృందాలతో ప్రతినిధులు నేరుగా మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రోగులందరూ సురక్షితంగా కోలుకుంటున్నారు.

ఐదో వంతు ఖర్చుతోనే రోబోటిక్ సర్జరీలు

రోబోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్, వాల్వ్ రిపేర్, బైపాస్ సర్జరీ వంటి అంశాలపై శాస్త్రీయ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ చర్చలో భారతదేశాన్ని ఎండోస్కోపిక్, రోబోటిక్ కార్డియాక్ సర్జరీ శిక్షణకు గ్లోబల్ హబ్‌గా ఎలా మార్చవచ్చనే అంశంపై నిపుణులు మాట్లాడారు. స్వదేశీ రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల గుండె జబ్బుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తాయని డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ ఆశాభావం వ్యక్తం చేశారు.

సదస్సులో భాగంగా రెండో రోజు వంద మందికి పైగా సీనియర్ సర్జన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జంతువుల గుండె నమూనాల సహాయంతో ఎండోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలపై అంతర్జాతీయ నిపుణులు వీరికి ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. సాధారణంగా ఇటువంటి అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలకు 18 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఈ శిక్షణను పూర్తిగా ఉచితంగా అందించింది.

వైద్య విద్యార్థుల్లో ప్రతిభతో పాటు సేవాభావం కూడా పెరగాలని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి పిలుపునిచ్చారు.

"పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కూడా లేవు. కానీ నేడు ఇది వైద్య విద్య, పరిశోధనలు, ఉచిత గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ స్థాయి కేంద్రంగా మారింది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి వైద్యం, విద్యను అందించడమే మా లక్ష్యం" అని సద్గురు శ్రీ మధుసూదన్ సాయి స్పష్టం చేశారు.

సర్జన్లు అంతర్జాతీయ నిపుణుల నుంచి నేరుగా నేర్చుకునేందుకు, అత్యాధునిక సాంకేతికతను పరిశీలించేందుకు ఈ వేదికను సిద్ధం చేశామని సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సి.ఎస్. హిరేమఠ్ తెలిపారు.

ప్రతి రెండేళ్లకోసారి సదస్సు

భవిష్యత్తులో విద్యా, పరిశోధనా రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఎస్‌ఎమ్‌ఎస్‌ఎమ్‌ఎస్‌ఆర్, కోల్‌కతాలోని మణిపాల్ హాస్పిటల్స్, ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ సంస్థలు ఒక అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ఈ అంతర్జాతీయ సదస్సును సంయుక్తంగా నిర్వహించనున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON