...
...
Next Story

గిఫ్ట్ నిఫ్టీ పతనం: అమెరికా-ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లలో గుబులు

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ పతనం నేపథ్యంలో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Published on: Jun 10, 2026 07:38 AM IST
Advertisement

అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ మొదలైన కలకలం దలాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మంగళవారం నాటి లాభాల నుంచి భారత మార్కెట్లు బుధవారం నష్టాల్లోకి మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గిఫ్ట్ నిఫ్టీ ఇస్తున్న ప్రతికూల సంకేతాలు

నిఫ్టీ నిన్నటి టాప్ లూజర్స్ ఛార్ట్ (PTI)
నిఫ్టీ నిన్నటి టాప్ లూజర్స్ ఛార్ట్ (PTI)

సింగపూర్‌లోని గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) మంగళవారం నాటి ముగింపు కంటే దాదాపు 59 పాయింట్ల నష్టంతో 23,272 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 ప్రతికూలంగా ప్రారంభం కానున్నాయని సూచిస్తోంది. అంతకుముందు మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 394.50 పాయింట్లు లాభపడి 73,918.76 వద్ద, నిఫ్టీ 119.10 పాయింట్ల లాభంతో 23,242.10 వద్ద స్థిరపడ్డాయి. అయితే, తాజా అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

"ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చల వార్తలతో మార్కెట్లు కొంత కోలుకున్నప్పటికీ, భౌగోళిక ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం, ద్రవ్యోల్బణం, ముడిచమురు ధరల అస్థిరత, రుతుపవనాల గమనం ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉంచుతాయి" అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు.

అమెరికా-ఇరాన్ యుద్ధం ముదరడమే కారణం

హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా, దానికి ప్రతికారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (Revolutionary Guards) బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళంపై డ్రోన్లతో దాడి చేశాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో శాంతి చర్చల ఆశలు అడుగంటాయి.

ఆసియా, వాల్ స్ట్రీట్ మార్కెట్ల పతనం

యుద్ధం పెరగడంతో ముడిచమురు ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.9% పెరిగి బ్యారెల్‌కు 92.29 డాలర్లకు, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ 0.8% పెరిగి 88.97 డాలర్లకు చేరుకున్నాయి. అయితే, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల పెంపు అంచనాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1.4% క్షీణించి పసిడి ఔన్స్ ధర 4,203.20 డాలర్లకు పడిపోయింది. వెండి సైతం 1.4% తగ్గి 64.48 డాలర్లకు చేరింది.

బాండ్ ఈల్డ్స్, డాలర్ అప్‌డేట్

జపాన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో అక్కడి 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 3 బేసిస్ పాయింట్లు పెరిగి 2.695 శాతానికి చేరాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 100.02 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే యూరో 1.1537 వద్ద, జపాన్ యెన్ 160.38 వద్ద ట్రేడవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe