Paddy Procurement in Telangana : అన్నదాతల నుంచి ధాన్యం, మొక్కజొన్న సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కొనుగోళ్ల పురోగతిని సమీక్షించారు. ధాన్యం సేకరణను ఒక 'మిషన్ మోడ్'లో తీసుకోవాలని…… క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు.

గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలన్నారు. ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దన్నారు.
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు:
- "ధాన్యం లోడింగ్ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి.
- ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు.
- లారీల కొరత ఉంటే దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి.
- ధాన్యం తరలించడానికి అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలి.
- పలు ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి.
- అవసరమైన చోట రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకుని ధాన్యాన్ని తరలించాలి. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలుండాలి.
- ప్రాంతాల వారిగా సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలి. ప్రతి అధికారి జవాబుదారితనంతో వ్యవహరించాల్సిందే.నిర్లక్ష్యం వహించే అధికారులు, కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదు.
- మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలి.
- అకాల వర్షాల సమయంలో రైతులకు నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి.
- వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి.
- వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
- ప్రతీ ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించాలి. ప్రతి రైస్‌మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.