హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫలితంగా ఈ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ శివరాంపల్లిలో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. ప్రజలకు అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని చెప్పారు. హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరించిన ప్రాంతాల్లో నైట్ ఎకానమీ కొనసాగే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ ప్రసంగం - ముఖ్యమైన అంశాలు:
- “స్థానిక పౌరులకు మంచి వాతావరణం కల్పించాం. ఇక్కడ ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడ లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అలాగే, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ లేక్స్ వద్ద స్టాల్స్ పెట్టి స్థానికులు పాలు, పండ్లు, కూరగాయలు పరిశుభ్రమైన వాతావరణంలో అమ్ముకోవడానికి వీలు కల్పిస్తాం.
- 99 రోజుల ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హైదరాబాద్‌లో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఒకప్పుడు హైదరాబాద్ రాక్స్, లేక్స్ తో ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఉండింది. ఈ నగరం మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంది.
- ఈ మహానగరానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను తొలగించే కార్యక్రమం చేపట్టాం.
- ఇది ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ఈ సిటీని అభివృద్ధి చేయడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టాం. రెండు రోజుల కిందట కొత్వాల్‌గూడ్ ఎకో పార్క్‌ను ప్రారంభించుకున్నాం.
- సాధ్యమైన తొందరగా మెట్రో విస్తరణ పనులను పూర్తి చేస్తాం. మిరాలం ట్యాంక్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. పక్కనే హైకోర్టు నూతన భవన నిర్మాణం సాగుతోంది. ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం.
- హైదరాబాద్ అత్యంత పురాతన, ప్రాముఖ్యత కలిగిన నగరం. ఆ ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశాం. ఏడాది కిందట బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు ఎలా ఉంది. ఇప్పుడేలా ఉంది. గమనించాలి.
- ఈ ఒరిజినల్ సిటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను చూడండి. ఆ పనులను చూసి ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}