...
...
Next Story

8th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! ఆ డిమాండ్​ నెరవేరడం కష్టమే..

8వ వేతన సంఘం అమలుకు ముందే కరువు భత్యాన్ని (డీఏ) బేసిక్ పేలో కలపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుతం అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.

Updated on: Jan 20, 2026, 05:59:59 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఇప్పుడు ఒకటే ఉత్కంఠ. 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చేలోపే ప్రస్తుతం ఉన్న కరువు భత్యం (డీఏ) ప్రాథమిక వేతనం (బేసిక్​ పే)లో కలిసిపోతుందా? ఈ చర్చకు గల కారణాలు, ప్రభుత్వ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

8వ వేతన సంఘం అమలు.. ఎప్పుడు?

8వ వేతన సంఘం లేటెస్ట్​ అప్డేట్స్​.. (Bloomberg)
8వ వేతన సంఘం లేటెస్ట్​ అప్డేట్స్​.. (Bloomberg)

7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 2026 జనవరి-జూన్ కాలానికి పెరగాల్సిన డీఏ, ఏడొవ వేతన సంఘం పరిధిలోకి రాదు. 8వ వేతన సంఘం తన పనిని ప్రారంభించినప్పటికీ, దాని సిఫార్సులు కార్యరూపం దాల్చడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.

సాధారణంగా ఏదైనా వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి కనీసం 18 నెలల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని సమీక్షించి, క్యాబినెట్ ఆమోదం పొంది, అమలు చేయడానికి మరో 6 నెలలైనా పడుతుంది. ఈ లెక్కన చూస్తే, 8వ వేతన సంఘం సిఫార్సులు 2027 చివరి కంటే ముందు అమలయ్యే అవకాశం కనిపించడం లేదు.

మరోవైపు, ప్రస్తుతం డీఏ 58 శాతానికి చేరుకోవడంతో.. కొత్త పే కమిషన్ వచ్చే వరకు మధ్యంతర ఊరటగా డీఏను బేసిక్ పేలో కలపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విలీన ప్రతిపాదన లేదు- స్పష్టం చేసిన కేంద్రం

ఉద్యోగుల డిమాండ్‌పై ప్రభుత్వం తన వైఖరిని తేల్చి చెప్పింది. 2025 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వం ఇలా పేర్కొంది: "ప్రస్తుత కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు."

8వ వేతన సంఘం పట్ల ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా, ఉద్యోగ సంఘాలు మాత్రం తమ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. వారి ప్రకారం:

డీఏను బేసిక్ పేలో కలిపితే ప్రాథమిక వేతనం పెరుగుతుంది.

దీనివల్ల ఇంటి అద్దె భత్యం (హెచ్​ఆర్​ఏ), ప్రయాణ భత్యం (టీఏ) వంటి ఇతర అలొవెన్సులు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లెక్కల్లో కూడా ఇది భారీ ప్రయోజనం చేకూరుస్తుంది.

ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు, అందుతున్న డీఏకు పొంతన ఉండటం లేదని వారు వాదిస్తున్నారు.

గతానుభవాలు ఏం చెబుతున్నాయి?

డీఏ విలీనంపై చర్చ ఇదే మొదటిసారి కాదు. గతంలో 5వ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2004లో 50% డీఏను బేసిక్ పేలో కలిపారు. అయితే 6వ వేతన సంఘం ఈ పద్ధతిని వ్యతిరేకించింది. డీఏను విలీనం చేస్తే ధరల సూచిక బేస్ మార్చాల్సి వస్తుందని, దానివల్ల భవిష్యత్తులో డీఏ రేటు తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించింది. అప్పటి నుంచి డీఏను విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది.

మరి నెక్ట్స్​ ఏంటి?

ప్రస్తుత పరిస్థితుల్లో 8వ వేతన సంఘంలో డీఏ విలీనం జరిగే అవకాశాలు దాదాపు శూన్యం. 8వ వేతన సంఘం నివేదిక వచ్చే వరకు ఉద్యోగులు, పెన్షనర్లు.. ఆరు నెలలకోసారి పెరిగే డీఏ పైనే ఆధారపడక తప్పదు. ప్రభుత్వం తన నిర్ణయంలో మార్పు చేసుకునే యోనచలో లేనట్లు కనిపిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks